భీంగల్‌లో ఘనంగా ప్రజాకవి అందెశ్రీ 65వ జయంతి వేడుకలు
తెలంగాణ మాతృగీత రచయిత సేవలను స్మరించిన సాహితీ ప్రముఖులు
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ప్రజాకవి, ప్రముఖ వాగ్దేయకారుడు, తెలంగాణ మాతృగీత రచయిత డాక్టర్ అందెశ్రీ 65వ జయంతి వేడుకలను భీంగల్ పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
భీంగల్‌కు చెందిన కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించిన అందెశ్రీ పశువుల పాలేరు స్థాయి నుంచి ప్రజాకవిగా ఎదిగి, తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం “జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం” రచించి తెలంగాణ ఉద్యమానికి విశేష సేవలు అందించారని కొనియాడారు.
సాంప్రదాయ విద్యాభ్యాసం లేకుండానే మూడు వేలకుపైగా కవితలు, సినీ గీతాలు రచించి ప్రత్యేక గుర్తింపు పొందారని, కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి చేసిన విశిష్ట సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటి నగదు పురస్కారంతో ఆయనను సత్కరించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ ఉపాధ్యక్షుడు తీగల రఘు, డప్పు ప్రశాంత్, నిచ్చేమోల్ల మహేష్, కొండ సాయికిరణ్, గజ్జెల విఘ్నేష్ (భరత్), సున్నపు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
