కాళోజివాడ గ్రామాన్ని సందర్శించిన రాష్ట్ర బృందం
సమగ్ర గ్రామాభివృద్ధి ప్రణాళికపై క్షేత్రస్థాయి పరిశీలన
తాడ్వాయి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విజిలెన్స్ బృందం శనివారం తాడ్వాయి మండలంలోని కాళోజివాడ గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధి ప్రణాళికపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది.
ఈ సందర్భంగా స్టేట్ విజిలెన్స్ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రతి డివిజన్‌లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా కాళోజివాడ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు.
మూడు సంవత్సరాల ప్రణాళిక ప్రకారం గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలన చేపట్టారు. గ్రామ జనాభా, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్రామాభివృద్ధికి అవసరమైన సమాచారాన్ని సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు నివేదికను సిద్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీడీ విజిలెన్స్ అధికారి సుబ్రహ్మణ్యం, జిల్లా సీఈవో, డీపీఓ, పీడీ, ఎంపీడీవో, ఎంపీవో, గ్రామ సర్పంచ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
