పీఆర్సీని వెంటనే ప్రకటించాలి
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలి: టీఎస్‌యూటీఎఫ్
ఆలేరు, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు విమర్శించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో శనివారం టీఎస్‌యూటీఎఫ్ ఆలేరు మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెతుకు సైదులు మాట్లాడుతూ, అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రాథమిక విద్యకు నష్టదాయకంగా ఉన్న జీఓ–25ను వెంటనే సవరించాలని, పీఓ–2018కు అనుగుణంగా సర్వీస్ నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టెట్‌లో సర్వీస్ వెయిటేజ్ కల్పించి, సబ్జెక్టుల వారీగా స్పెషల్ టెట్ నిర్వహించాలని కోరారు.
బీసీ, గిరిజన గురుకులాల టైమ్‌టేబుల్‌ను సవరించాలని, మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. అలాగే ఐదు విడతల పెండింగ్ డీఏను వెంటనే విడుదల చేసి, పీఆర్సీ నివేదికను ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ ఆలేరు మండల శాఖ అధ్యక్షుడు వై. వెంకటేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎండీ సయ్యద్, టాప్రా జిల్లా అధ్యక్షుడు బొమ్మకంటి బాలరాజు, మండల కోశాధికారి అంజయ్య, మండల బాధ్యులు సిద్ధేశ్వర్, శంకర్, సత్యం, భాస్కరాచారి, పరమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
