Vijayawada-Railway : హైస్పీడ్ లో అభివృద్ధి Andhra Peadesh Top Story
Vijayawada-Railway : హైస్పీడ్ లో అభివృద్ధి Andhra Peadesh Top Story
- బెజవాడకు కొత్త ఇంజన్
- ఇండస్ట్రీ కారిడార్ కు…
- ఏపీ రైల్వే గేట్ వే
- విజయవాడ రైల్వేకు స్వర్ణయుగం..
- దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో కీలకం
- 46 కి.మీ. అదనపు మార్గం..
- 5 కొత్త స్టేషన్ల చేరిక
- రాజధాని జనం ఖుషీఖుషీ
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )
దశాబ్దకాలంగా ఎదురుచూసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావంతో విజయవాడ డివిజన్ ప్రాధాన్యం మరింత పెరగనుంది. దేశంలో 18వ రైల్వే జోన్‌గా విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వేలో విజయవాడ డివిజన్ కీలక శక్తికేంద్రంగా అవతరించబోతోంది. తీరప్రాంత రైల్వే నెట్‌వర్క్, పోర్టు అనుసంధాన మార్గాలు, అధిక ప్రయాణికుల రద్దీ, భారీ సరుకు రవాణా సామర్థ్యం వంటి అంశాలు విజయవాడ డివిజన్‌ను కొత్త జోన్‌లో అత్యంత వ్యూహాత్మక విభాగంగా నిలబెడుతున్నాయి.
Vijayawada-Railway : విజయవాడ డివిజన్ విస్తరణ

దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన ఈ కొత్త జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం డివిజన్లు పనిచేయనున్నాయి. పాత వాల్తేరు డివిజన్ విభజన అనంతరం తీరప్రాంత ప్రయాణికుల సేవలకు సంబంధించిన అనేక కీలక మార్గాలు విజయవాడ డివిజన్ పరిధిలోకి రావడంతో పరిపాలనా ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది.
Vijayawada-Railway : పెరుగుతున్న డివిజన్ బలం

దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ ఇప్పటికే దక్షిణ భారత రైల్వే రవాణాలో ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. ఇప్పుడు కొత్త జోన్ ఏర్పాటుతో గూడూరు,దువ్వాడ ప్రధాన మార్గం, విజయవాడ,మోతుమరి సెక్షన్, గుడివాడ,మచిలీపట్నం, భీమవరం,నర్సాపురం, సామర్లకోట,కాకినాడ పోర్టు, వెంకటాచలం,కృష్ణపట్నం పోర్టు వంటి కీలక మార్గాల నిర్వహణ మరింత బలోపేతం కానుంది. అదనంగా 46 కిలోమీటర్ల రైల్వే మార్గం, ఐదు కొత్త స్టేషన్లు విజయవాడ డివిజన్‌కు చేరడం ద్వారా కార్యకలాపాల పరిధి విస్తరించనుంది. దీంతో ప్రయాణికులకు వాణిజ్యపరంగా కూడా మరింత బలం చేకూరినట్లు అయింది.
. Vijayawada-Railway : .పోర్టులతో అనుసంధానం

విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులతో పాటు భవిష్యత్తులో మూలపేట పోర్టుకు రైల్వే అనుసంధానం మరింత సమర్థవంతం కానుంది. ఎగుమతులు,దిగుమతులు, బొగ్గు, ఇనుము ఖనిజం, వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక సరుకుల రవాణాలో విజయవాడ డివిజన్ కీలక లాజిస్టిక్ హబ్‌గా ఎదగనుంది. దీంతో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.
Vijayawada-Railway : సేవల్లో వేగం

కొత్త జోన్ పరిధిలో 500కు పైగా ప్రయాణికుల రైళ్లు, 800కు పైగా గూడ్స్ రైళ్లు నిర్వహించే సామర్థ్యం ఉండనుంది. పరిపాలనా నిర్ణయాలు ప్రాంతీయ స్థాయిలోనే తీసుకునే అవకాశం పెరగడంతో కొత్త రైళ్లు, అదనపు సర్వీసులు, స్టేషన్ అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ వేగవంతం కావచ్చని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. విజయవాడ, గుంతకల్లు, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో లోకో షెడ్లు, కోచ్ సంరక్షణ కేంద్రాలు, వాగన్ నిర్వహణ డిపోలు, మెయింటెనెన్స్ యూనిట్లు మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
Vijayawada-Railway : అభివృద్ధికి కొత్త ఇంజన్.. వేగం.

రాష్ట్ర విభజన చట్టం తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యరూపం దాల్చడంతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపు లభించనుంది. ముఖ్యంగా విజయవాడ డివిజన్‌కు పెరిగిన పరిధి, పోర్టు అనుసంధానం, సరుకు రవాణా సామర్థ్యం, పరిపాలనా ప్రాధాన్యం కలిసి భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పురోగతికి బలమైన రైల్వే ఇంజిన్‌గా మారనున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎంతో కీలకంగా ఉన్న కొత్త రైల్వే జోన్ లో విజయవాడ డివిజన్ మరింత క్రియాశీలకంగా వ్యవహరించి ప్రయాణికులకు వాణిజ్యపరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
ALSO READ : NH 544D Palnadu Highway పల్నాడు హైస్పీడ్ Andhra Prabha Top Story
