NH 544D Palnadu Highway పల్నాడు హైస్పీడ్ Andhra Prabha Top Story

NH 544D Palnadu Highway పల్నాడు హైస్పీడ్ Andhra Prabha Top Story
- ‘హైవే’ బాటలో పరుగో పరుగు
- అభివృద్ధిపై కూటమి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ..
- వేల కోట్లతో రహదారుల విస్తరణ!
- పర్యాటకానికి ప్రగతి వారధి
- ఏపీ-తెలంగాణ వాణిజ్య బంధం బలోపేతం
(పల్నాడు బ్యూరో , ఆంధ్రప్రభ):
రోడ్లు అభివృద్దికి ముఖద్వారం వంటివి. రోడ్లు అభివృద్ది చెంది రాజధాని అమరావతికి అనుసంధానం అవ్వడం ద్వారా పల్నాడు జిల్లా సర్వతోముఖాభివృద్ది సుసాధ్యమౌతుందని చెప్పవచ్చు. ఈ దిశగానే ప్రభుత్వం రోడ్ల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. రహదారులు లాంటి కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పల్నాడులోని అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం పల్నాడు ప్రాంత పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే కేంద్రాన్ని ఒప్పించి పేరేచర్ల-కొండమోడు 4 లైన్ల రహదారి, వినుకొండ-గుంటూరు 4 లైన్ల రహదారితోపాటు మాచర్ల నియోజకవర్గంలో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చేయడంలో విజయం సాధించింది.
పల్నాడు హైవేల అభివృద్ధి

పల్నాడు జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ వేగంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న కీలక రహదారి ప్రాజెక్టులు జిల్లాకు కొత్త రూపును తీసుకువస్తున్నాయి. ఈ హైవేలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభించనుంది. పల్నాడు ప్రాంతానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నాణ్యమైన ఖనిజ సంపదతో పాటు పక్కనే నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం పల్నాడు జిల్లా అట్టడుగున ఉంది. యువత ఉపాధి లేక నిరుద్యోగంతో, ప్రజలు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు, నీరు అందుబాటులో ఉన్నా రవాణా సదుపాయం అవరోధంగా మారింది. కూటమి ప్రభుత్వం పల్నాడు జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే మౌలిక వసతుల్లో కీలకమైన రహదారుల నిర్మాణంపై దృష్టి సారించింది.
NH 544D Palnadu Highway : కొండమోడు – పేరేచర్ల
పల్నాడు జిల్లాలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఇప్పటికే 11.57శాతం పని పూర్తయింది. ఈ నేషనల్ హైవే ప్రాజెక్టుతో ప్రయాణ సమయం, ఖర్చు తగ్గి, ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుంది. 49.9 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. రూ.1032.52 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ హైవే పనులు వేగంగా సాగుతుండగా, వచ్చే ఏడాదిలో పూర్తయ్యే అవకాశముంది. ఈ మార్గం పూర్తైతే గుంటూరు – పల్నాడు మధ్య రవాణా మరింత సులభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం కలిసి నేషనల్ హైవేల నిర్మాణం వేగవంతం చేసింది. మార్గంలో వాహనాల రద్దీ పెరిగింది. అయితే ఈ పెరిగిన వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా రోడ్డును విస్తరించలేదు. దీనివల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించింది. దీనికి 167ఏజీ అనే నంబరును కేటాయించింది. ఈ రహదారి నిర్మాణ పనులను ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానంలో చేపట్టారు. ఈ విధానంలో, టెండర్లు పిలిచి, పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించి లక్ష్యం మేర జరిగేలా చూస్తున్నామని అధికారులు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొండమోడు రహదారి విస్తరణ పనులు పూర్తయితే హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఊరట దక్కినట్లే. గుంటూరు, అమరావతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవడమే కాకుండా.. ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ రహదారి విస్తరణ పల్నాడు ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలకు, పేరేచర్ల దగ్గర ఉన్న క్వారీల నుంచి వచ్చే కంకర ఉత్పత్తుల రవాణాకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటు గుంటూరు, పల్నాడు ప్రాంతాల నుంచి పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటల రవాణా సులభతరం అవుతుంది. ఈ మార్పులన్నీ ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు. మొత్తం 49.91 కిలోమీటర్ల రోడ్డును రూ.881.61కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ హైవేలో నాలుగు బైపాస్‌లు వస్తాయి. కొండమోడు దగ్గర 2.72, సత్తెనపల్లి వద్ద 11.17, మేడికొండూరు సమీపంలో 5.34కి.మీ మేర బైపాస్‌లను నిర్మిస్తారు. రెండు మెయిన్ బ్రిడ్జిలు, 11 చిన్న బ్రిడ్జిలు కూడా వస్తాయి. సత్తెనపల్లి దగ్గర 2.. కొండమోడు, రెడ్డిగూడెం దగ్గర ఒక్కొటి చొప్పున మొత్తం నాలుగు చోట్ల అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. ఆర్వోబీ 1, టోల్‌ప్లాజా 1 ఏర్పాటు చేస్తారు.
NH 544D Palnadu Highway : దాచేపల్లి – మాచర్ల

జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు బైపాస్‌లు నిర్మిస్తున్నారు. దాచేపల్లి-మాచర్ల జాతీయ రహదారి 167ఏడీ మార్గంలో గురజాల, రెంటచింతల, మాచర్ల పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న రహదారులు అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా మూడు పట్టణాల్లో రహదారులు, డ్రెయిన్ల అభివృద్ధికి జాతీయ రహదారుల సంస్థ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది నెలల వ్యవధిలో అభివృద్ధి పనులు పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఆయా పట్టణాల నుంచి బైపాస్‌లోకి ప్రవేశించే మార్గాలను కూడా విస్తరించి అభివృద్ధి చేస్తున్నందున వాహన చోదకులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. పల్నాడు జిల్లాలో అద్దంకి-నార్కట్‌పల్లి, నకిరేకల్-ఏర్పేడు మార్గాలను అనుసంధానం చేసే 167ఏడీ జాతీయ రహదారి (దాచేపల్లి-మాచర్ల) అభివృద్ధి చేయడంతో రవాణా అవకాశాలు మెరుగవుతాయి. 37 కిలోమీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ రహదారి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంది. రూ.403.22 కోట్లతో నిర్మించిన ఈ మార్గం మాచర్ల ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీని అందిస్తోంది.
దాచేపల్లి-మాచర్ల మార్గంలో గురజాల, రెంటచింతల, మాచర్ల ఉన్నాయి. వీటి గుండా ప్రస్తుతం ఉన్న మార్గం వెళుతుండగా ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మూడింటికి బైపాస్‌లు నిర్మించారు. అయితే పట్టణాల్లో రోడ్లు విస్తరించడంతోపాటు మార్గానికి రెండువైపులా డ్రెయిన్లు నిర్మించి భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూడటానికి రూ.50 కోట్లు వెచ్చిస్తున్నారు. మాచర్లలో 4.9 కిలోమీటర్ల దూరం ప్రస్తుతం ఉన్న మార్గాన్ని రెండువైపులా 10 అడుగుల మేర విస్తరించడంతోపాటు రెండువైపులా డ్రెయిన్లు నిర్మిస్తారు. రెంటచింతలలో నాలుగు కిలోమీటర్ల మార్గాన్ని రెండువైపులా 15 అడుగుల మేర విస్తరించి అవసరమైనచోట 500 మీటర్లు దూరం డ్రెయిన్ నిర్మిస్తారు. గురజాలలో ప్రస్తుతం నాలుగు వరుసల రహదారి ఉంది. 4.2 కిలోమీటర్ల మేర మార్గాన్ని ఇరువైపులా 10 అడుగుల మేర విస్తరించి అవసరమైన ప్రాంతాల్లో డ్రెయిన్ నిర్మిస్తారు. దీంతో పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న మార్గాల రూపురేఖలు మారనున్నాయి.
NH 544D Palnadu Highway : నాగార్జునసాగర్ – దావుపల్లి
47 కిలోమీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం పూర్తై వినియోగంలోకి వచ్చింది. రూ.403.86 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు సాగర్ ప్రాంత రవాణాకు కీలకంగా మారింది. దీనికి కొనసాగింపుగా దావుపల్లి – మల్లవరం వరకు చేపట్టిన రహదారి పనులు రూ.393.61 కోట్లతో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తవడంతో త్వరలోనే ఈ మార్గం కూడా అందుబాటులోకి రానుంది. పల్నాడు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతం గుండా దీన్ని నిర్మించడంతో మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడనుంది. నకిరేకల్ నుంచి ఏర్పేడు వరకు రెండు వరుసలుగా విస్తరించారు. పల్నాడు జిల్లా దావుపల్లి, ప్రకాశం జిల్లా మల్లపాలెం నడుమ 20 కిలోమీటర్ల మార్గం 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా అభివృద్ధి చేయడంతో భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బంది తొలగినట్లైంది. ఈ ప్రాంతానికి అనుసంధానం పెరగడంతోపాటు పర్యటకప్రాంతాలకు మార్గం సుగమం కావడంతో ప్రగతి పట్టాలెక్కనుంది.
NH 544D Palnadu Highway : ఓడరేవు కారిడార్
ఓడరేవు నుంచి చిలకలూరిపేట వరకు హైవే ఇప్పటికే పూర్తై ప్రజలకు అందుబాటులో ఉంది. రెండో దశలో చిలకలూరిపేట నుంచి నకరికల్లు వరకు, నరసరావుపేట మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి రూ.313.15 కోట్లతో ఎల్ఓఏ జారీ అయింది. భూసేకరణ, కోర్టు వ్యవహారాలు పూర్తికావడంతో త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.787 కోట్లు. ఓడరేవు – చిలకలూరిపేట – నకిరేకల్ కారిడార్ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలను కలిపే ఒక ముఖ్యమైన జాతీయ రహదారి ప్రాజెక్టు ఇది వాణిజ్య రవాణాకు, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.మార్గం: ఈ రహదారి బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతమైన ఓడరేవు నుండి ప్రారంభమై, పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మీదుగా తెలంగాణలోని నల్గొండ జిల్లా నకిరేకల్ వరకు అనుసంధానించబడుతుంది. ఓడరేవు నుండి చిలకలూరిపేట వరకు సుమారు 90 శాతం హైవే నిర్మాణం పూర్తయింది. చిలకలూరిపేట నుండి నకిరేకల్ వరకు జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ కారిడార్ ద్వారా సముద్ర తీర ప్రాంతాల నుండి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు సరుకు రవాణా వేగవంతం అవుతుంది
వినుకొండ – గుంటూరు జాతీయ రహదారి…
వినుకొండ నుంచి గుంటూరు వరకు 90 కి.మీ. రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. దీనికి సంబంధించి జాతీయ రహదారుల విభాగం 3ఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత డీపీఆర్ పూర్తి కావడంతో రహదారి నిర్మించేందుకు హద్దులను గుర్తించి స్తంభాలు పాతాలని నిర్ణయించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు వేర్వేరుగా షెడ్యూల్ విడుదల చేశారు. వినుకొండ నుంచి గుంటూరు వరకు 90 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.2360 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పల్నాడు – గుంటూరు మధ్య రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. పల్నాడు అభివృద్ధికి బలమైన మౌలిక వసతులు
సరికొత్త పుంతలు తొక్కనున్న పల్నాడు ప్రగతి…
రహదారులు కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాదు.. ఒక ప్రాంత సామాజిక, ఆర్థిక వికాసానికి జీవనాడులు. దశాబ్దాలుగా ఖనిజ సంపద, జల వనరులు ఉన్నప్పటికీ సరైన రవాణా సౌకర్యాలు లేక వెనుకబడిన పల్నాడు జిల్లాకు ఈ జాతీయ రహదారుల విస్తరణ సరికొత్త ఊపిరిని అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కేంద్రంతో సమన్వయం చేసుకొని వేల కోట్ల రూపాయల నిధులు సాధించడం పల్నాడు భవిష్యత్తుపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం. కొండమోడు-పేరేచర్ల, వినుకొండ-గుంటూరు వంటి ప్రతిష్టాత్మక 4 లేన్ల రహదారులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. రాజధాని అమరావతితో పల్నాడుకు అనుసంధానం మరింత బలపడుతుంది. ఫలితంగా క్వారీలు, సిమెంట్ పరిశ్రమల రవాణా ఖర్చులు తగ్గడమే కాక, మిర్చి, పత్తి పండించే రైతులకు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడం సులువవుతుంది. పర్యాటక రంగానికి కొత్త కళ రానుంది. ఒకప్పుడు ఉపాధి లేక వలసలకు కేరాఫ్‌గా ఉన్న పల్నాడు.. రాబోయే రోజుల్లో పారిశ్రామిక హబ్‌గా, పెట్టుబడుల స్వర్గధామంగా ఎదగడానికి ఈ రహదారుల అభివృద్ధే ప్రధాన ముఖద్వారం కానుంది. మౌలిక వసతుల బలోపేతంతో పల్నాడు జిల్లా సర్వతోముఖాభివృద్ధి ఇక సుసాధ్యమే!..
NH 544D Palnadu Highway : కొండవీడు కోటకు అనుసంధానం

పల్నాడు జిల్లాలోని చారిత్రాత్మక కొండవీడు కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, జాతీయ రహదారుల నుండి కోటకు మెరుగైన కనెక్టివిటీ కల్పించాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, టీడీపీ లోక్‌సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ.. కొండవీడు కోట పర్యాటక అభివృద్ధికి రెండు కీలకమైన 4 లేన్ల అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. కొండవీడు కోటకు వందల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో నిర్మితమై, విజయనగర సామ్రాజ్య వైభవానికి సాక్ష్యంగా నిలిచిన కొండవీడు కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ చారిత్రక ప్రాంతానికి మెరుగైన రహదారులు అందుబాటులోకి వస్తే.. పర్యాటకంగానే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
NH 544D Palnadu Highway : ఎంపీ ప్రతిపాదిత 4 లేన్లు
- ఫిరంగిపురం – గణేశ్వరపాడు:
జాతీయ రహదారి 544- డి (అనంతపూర్ – గుంటూరు) జంక్షన్ అయిన ఫిరంగిపురం నుండి గణేశ్వరపాడు వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారి. - బోయపాలెం – గణేశ్వరపాడు:-
జాతీయ రహదారి 16 (చెన్నై – కోల్‌కతా) జంక్షన్ అయిన బోయపాలెం నుండి గణేశ్వరపాడు వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారి. మొత్తం 9 కిలోమీటర్ల మేర ఈ రెండు అనుసంధాన రహదారుల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
ALSO READ : Digital Revolution : దుర్గ గుడిలో,, డిజిటల్ విప్లవం Andhra Prabha Top News
