May-31-Success-Story : ఫ్యాక్షన్ పీడ వీడి ..Andhra Prabha Top Story

May-31-Success-Story : ఫ్యాక్షన్ పీడ వీడి ..Andhra Prabha Top Story

  • ఫారిన్​ నీడలో..
  • పల్నాడు యూత్​ నయా హిస్టరీ…!
  • నాటి రక్త చరిత్రకు చరమగీతం…
  • నేటి పల్నాడు ప్రగతి ప్రస్థానం
  • జయహో పల్నాడు బిడ్డ

(ప‌ల్నాడుబ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌):

“చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు / నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు / సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు / పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు”. ఇదీ కవిసార్వభౌముడు శ్రీనాథుడు తన పద్యంలో వల్లించాడు. కానీ ఒకప్పుడు ఈ చిన్న చిన్న రాళ్లే , పలుగు రాళ్లు కాగ.. వేటకొడవళ్ల నరుకుడు.. తెగిపడే కుత్తుకలు.. రక్త ధార పరవళ్లు.. ఏతావాత పల్నాటి పగ ప్రతీకార ఫ్యాక్షన్​ చరిత్రకు ఇవే సాక్షాలు… కానీ ఇప్పుడు సీన్​ రివర్స్​ అయింది. ఇక్కడి యువత కక్షాకార్పణాల పడగ నీడను వీడారు. కత్తులు వదిలేశారు. కంప్యూటర్​ కీబోర్డుల్లో బిజీబిజీగా మారారు. సాప్ట్​ వేర్​ తో విదేశాల్లో దూసుకుపోతున్నారు. ఇక కత్తులాట జాతరలు లేవు. బాంబుల మోత లేదు. పల్పాడులో నయా హిస్టరీ స్థితి గతి తెలుసుకుందాం.

May-31-Success-Story : క‌క్ష‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌…..!

May-31-Success-Story

ఒక్క‌ప్పుడు ప‌ల్నాడు ప్రాంతం క‌క్ష‌ల‌కు, హ‌త్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉండేది. ప్ర‌తి రోజు ఏదో గ్రామంలో ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు, పోలీస్ పికేటింగులు, హ‌త్య‌లతో ప్ర‌జ‌లు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపేవారు. క‌నీస వ‌స‌తులు లేని గ్రామాల్లో, గుక్కెడు నీటికి అల‌మ‌టించే ప్రాంతాల్లో నెత్తురు ఏరులై పారేది. ముందుగా వ‌ర్గాలు, కులాలు, ఆ త‌ర్వాత పార్టీలు వివాదాలను, ఘ‌ర్ష‌ణ‌ల‌తో మ‌రింత‌గా రాజేశాయి. చారిత్రాత్మకంగా పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిజం అనేది ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది. 12వ శతాబ్దంలో జరిగిన పల్నాడు యుద్ధం మొదలుకొని, ఆధునిక కాలంలో రాజకీయాలు, కక్షలు, హత్యల వరకు ఈ ప్రాంతం వర్గ పోరుకు ప్రసిద్ధి చెందింది. పది మంది బతుకు కోరేవాడు నాయకుడు.. తాను నాయకుడిగా ఎదగడం కోసం పది మిందిని సమిధలు చేసే వాడు స్వార్థపరుడు.. తమ నాయకుడి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారు కొందరు.. ప్రాణాలు కోల్పోయిన వారు మరికొందరు.. మనిషే కనిపించక, ఏమైపోయారో తెలియక కనుమరుగైన వారు ఇంకొందరు.. వీరంతా ఇల్లు, ఇల్లాలు, పిల్లలను వదిలి నేతల బాగు కోసం ప్రాణాలే ధారపోశారు. మంచో.. చెడో, తెలిసో.. తెలియకో వారి వెంట నడిచారు. ఈ రాజకీయ ఘర్షణల వల్ల నష్టపోయింది అణగారిన వర్గాల ప్రజలే. ఫ్యాక్ష‌న్ ఘ‌ర్ష‌ణ‌ల‌తో ప‌ల్నాడు ప్రాంతం అభివృద్దికి దూర‌మైంది. ఆ ప్రాంతం దట్టమైన నల్లమల అడవికి సమీపంలో ఉండటం వల్ల త్వరలోనే మావోయిస్టులు ఈ ప్రాంతంలో బలపడ్డారు. ఇలాంటి పల్నాడు చరిత్ర వర్గపోరాటాలతో మలినమై ఉండేది. ఎన్నికలు సమీపిస్తే చాలు మళ్లీ కొత్త హింసా చక్రం మొదలయ్యేది. చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు రెండు వర్గాల మధ్య హింస, హత్యలు, దాడులు సర్వసాధారణంగా ఉండేవి. ఈ వర్గపోరు కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది కుటుంబాలు తమ స్వగ్రామాలను వదిలి పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆస్తుల ధ్వంసం, సామాజిక బహిష్కరణలు నిత్యకృత్యంగా మారేవి. పల్నాడు ప్రాంతంలో అత్యధిక హింసకు ప్రధాన కారణం వెనుకబాటుతనంగా చెబుతుంటారు సామాజికవేత్తలు. విద్య, ఉద్యోగాల కంటే ఫ్యాక్షన్‌ గొడవలకే అక్కడి వారు ప్రాధాన్యం ఇవ్వడానికి ఇదే కారణంగా విశ్లేషిస్తుంటారు. ఈ రాజకీయ ఘర్షణలు, కుల పిచ్చి, ఫ్యాక్షనిజం కారణంగా ఎక్కువగా నష్టపోయేది అణగారిన వర్గాలకు చెందిన వారే. వర్గ ఆధిపత్యపోరులో తమ వర్గం నాయకుడికి రాజకీయ హోదా కట్టబెట్టాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలు ప్రవేశం చేస్తాయి. ఒక్కో వర్గం ఒక్కో రాజకీయ పార్టీని ఆశ్రయించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. పల్నాడు నెత్తుటి కథ కూడా ఇదే నిజమని చెబుతోంది.

May-31-Success-Story : చిన్న పాటి వివాదాలే…!

May-31-Success-Story

చిన్న పాటి సంఘ‌ట‌న‌లే పెను విషాదాల‌కు కార‌ణ‌మ‌య్యేవి. ఉదాహ‌ర‌ణ‌కు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు ఐదువేల మంది జనాభా ఉన్న చిన్న పల్లెటూరు. 35ఏళ్ల క్రితమే ఈ గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. అందరూ చదువుకున్నవారే. కులాలు అనేకమున్నా అందరిదీ ఒకే మాట. భిన్నత్వంలో ఏకత్వం వారి సొంతం. ఆ ఊరికి రాజకీయ చైతన్యం ఎక్కువ. విప్లవ భావాలు, కమ్యూనిజం ఆనవాళ్లు ఉన్న గ్రామమది. నక్సల్బరీ యోధుడు చారు మజుందార్‌ ఆంధ్రాలో మొట్టమొదట అడుగుపెట్టిన గ్రామమది. పాడి పంటలు, ఐశ్వర్యంతో తులతూగే వైభోగం ఆ గ్రామం సొంతం. ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామానికి ఓ చిన్నగొడవ అంతులేని విషాదం, నష్టం మిగిల్చింది. అప్పట్లో జరిగిన ఎన్నికలలో ఓ చిన్న గొడవ తలెత్తింది. అది కాస్తా కులాల మధ్య కార్చిచ్చులా మారింది. రానురాను ఫ్యాక్షన్‌గా రూపాంతరం చెందింది. తన మన తేడా లేకుండా హత్యలకు పాల్పడ్డారు. ఏ ఇంట చూసినా సౌభాగ్యం దూరమైన మహిళలే. ఊర్లోని మగవాళ్లందరిపై హత్య కేసులు నమోదయ్యాయి. పోలీసులు అరెస్టు చేసేందుకు గ్రామంలోకి రావడంతో తప్పించుకునేందుకు భార్యాబిడ్డలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఎక్కడున్నారో చాలారోజుల వరకూ అంతు పట్టలేదు. హైదరాబాద్‌, ముంబై వెళ్లి తలదాచుకున్నారు. 30 ఎకరాల భూములున్న ఆసాములు సైతం రోజు కూలీలుగా మారారు. సాగుచేసే నాథుడు లేక, పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేక వేలాది ఎకరాల కొద్ది పొలాలు అడవిగా మారాయి. పచ్చని పంటలతో కళకళలాడిన పల్లెటూరు కరువు బారిన పడింది. ఈనాటికీ నాటి చేదు గుర్తులు ఆ గ్రామంలో కనపడతాయి.

May-31-Success-Story : నిత్యం కరువు ఘోష

May-31-Success-Story

ఫ్యాక్షన్‌ గొడవలు ఎక్కువగా జరుగుతుండటంతో పులిపాడు, దైద, తేలుకుట్ల, గొట్టిముక్కల గ్రామాలను కలుపుతూ వెళ్లే ప్రాంతాన్ని పోలీస్‌ పరిభాషలో పంజాబ్‌ బెల్ట్‌గా అప్పట్లో పిలిచేవారు. 1942 నుంచి 2009 వరకూ వర్గ ఘర్షణలతో ఈ గ్రామాల్లో 70 నుంచి 80 మంది వరకు హత్యకు గురయ్యారని పోలీసు రికార్డు వెల్లడిస్తోంది. గొడవలు పడటం కేసులు వాయిదాల కోసం పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకున్నారు.

May-31-Success-Story : ఇప్పుడు సీన్​ రివర్స్​

May-31-Success-Story

12వ శతాబ్దపు చారిత్రక పల్నాటి యుద్ధం నాటి పౌరుషం… ఆధునిక కాలంలో గ్రామాలను కల్లోలపరిచిన ఫ్యాక్షన్ కక్షలు… బాంబుల దాడులు, పోలీస్ పికేటింగులతో నిత్యం నెత్తురోడిన నేల అది. పది మంది బాగు కోసం ప్రాణాలు అర్పించిన అమాయకులు ఒకవైపు అయితే, రాజకీయ లబ్ధి కోసం అణగారిన వర్గాలను సమిధలను చేసిన స్వార్థ రాజకీయాలు ఆ ప్రాంతాన్ని దశాబ్దాల పాటు వెనుకబాటుతనంలోకి నెట్టేసాయి. చిన్న వివాదానికే పచ్చని పల్లెలు అడవిగా మారిన జూలకల్లు లాంటి చేదు జ్ఞాపకాలు ఎన్నో….! కానీ, కాలం మారింది. నాటి తరం పడిన కష్టాల నుంచి గుణపాఠం నేర్చుకున్న నేటి పల్నాడు యువత… కక్షల కత్తులను వదిలి కంప్యూటర్ కీబోర్డులు పట్టింది. నాడు బాంబుల పేలుళ్లతో రికార్డులకెక్కిన గ్రామాల్లోని యువత, నేడు లండన్, అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో సాఫ్ట్‌వేర్ కొలువులు సాధిస్తూ జిల్లాకు విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతోంది. ఫ్యాక్షన్ నీడలను పూర్తిగా తుడిచేస్తూ… అటు వ్యవసాయం, ఇటు పారిశ్రామికీకరణ, మరోవైపు ఐటీ దిశగా పల్నాడు జిల్లా నేడు ప్రగతి పథంలో శరవేగంగా దూసుకుపోతోంది.

May-31-Success-Story : ఉద్యోగాల వేటలో

May-31-Success-Story

నాడు ఫ్యాక్షన్‌ హత్యలతో రక్తాన్ని ఏరులై పారించిన గ్రామాలు నేడు అభివృద్ధిబాట పట్టాయి. నాటి త‌రం నుంచి గుణ‌పాఠాలు నేర్చుకున్న యువ‌త నేడు అభివృద్ది బాట ప‌ట్టారు. ప‌ల్నాడులోని ఈ గ్రామాలు చూస్తుంటే మారిన ప‌ల్నాడు సుస్ప‌ష్టంగా క‌న‌బ‌డుతుంది. పల్నాడులోనే మొదటిసారి బాంబు పేలిన గ్రామంగా పోలీసు రికార్డుల్లో ఉన్న గురజాల మండలం పులిపాడు. ప్రస్తుతం అభివృద్ధిలో జిల్లాకే దారి చూపుతోంది. ఫ్యాక్షన్‌ ఆనవాళ్లు గురజాల మండలంలో పూర్తిగా కనుమరుగయ్యాయి. యువత కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకుని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

May-31-Success-Story : విదేశాల్లో స్థిరత్వం

పంటలు పండించుకోవడానికి సమయం దొరికేది కాదు. దీంతో 4 గ్రామాలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయి. ఇలా ఒకరి గొడవలో తలదూర్చి అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగడం ఏంటని మిగతా వారిలో మార్పు వచ్చింది. పిల్లల్ని చదివించడం ప్రారంభించారు. కాలక్రమేణా వారు ఉన్నత విద్యావంతులై విదేశాల్లో స్థిరపడ్డారు. పులిపాడు గ్రామం నుంచి సుమారుగా 200 మంది అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, జర్మనీ వంటి దేశాలలో ఉద్యోగాలను చేస్తున్నారు. జిల్లాలో విదేశీమారకద్రవ్యం అధికంగా వచ్చే గ్రామంగా పులిపాడు స్థిరపడిపోయింది. ఇలాంటి గ్రామాలు ఇప్పుడు జిల్లాలో అనేకం క‌నిపిస్తున్నాయి.

May-31-Success-Story : ప్ర‌గ‌తి ప‌థంలో

May-31-Success-Story

చారిత్రక వైభవానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన పల్నాడు జిల్లా నేడు ప్రగతి పథంలో దూసుకుపోతోంది. గ‌త కాలంలో ఉన్న ఫ్యాక్ష‌న్ మ‌చ్చ‌ని తుడిచివేసి శ‌ర‌వేగంగా అభివృద్ది దిశ‌గా ప‌య‌ణిస్తోంది. వ్య‌వ‌సాయ‌, పారిశ్రామిక, మౌలిక వసతుల రంగాలలో సాధిస్తున్న పురోగతితో జిల్లా సరికొత్త రూపును సంతరించుకుంటోంది. పల్నాటి సిరులైన వాణిజ్య పంటలు మిరప, పత్తి సాగుతో పాటు నాగార్జునసాగర్ కుడికాల్వ ద్వారా అందుతున్న సాగునీరు ఇక్కడి రైతాంగానికి కొండంత అండగా నిలుస్తోంది. ఆధునిక కోల్డ్ స్టోరేజ్ వసతులు, మార్కెటింగ్ సౌకర్యాలు తోడవడంతో వ్యవసాయ రంగం మరింత బలోపేతమవుతోంది. మరోవైపు పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో లభ్యమవుతున్న నాణ్యమైన సున్నపురాయి నిల్వలు సిమెంట్ పరిశ్రమల విస్తరణకు ఊతమిస్తూ స్థానిక యువతకు పెద్దపీట వేస్తున్నాయి. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు జిల్లా ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు-కర్నూలు రహదారుల అనుసంధానం, చిలకలూరిపేట బైపాస్ రోడ్డు వంటి ప్రతిష్టాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టులు వేగవంతం కావడంతో రవాణా కష్టాలు తీరి, వాణిజ్య కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. పల్లెలను పట్టణాలతో ముడిపెట్టే గ్రామీణ రహదారుల నిర్మాణం పల్లెల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్యా, వైద్య రంగాల్లో కూడా జిల్లా ముందంజలో ఉంది. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, డిజిటల్ తరగతుల నిర్వహణతో పాటు జిల్లాలో నూతనంగా ఏర్పాటైన వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ సేవలు పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చేరువ చేస్తున్నాయి. గతంలో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడిన ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల్లోనూ పల్నాడు తన ప్రత్యేకతను చాటుకుంటోంది. త్రికూటాచల మహాక్షేత్రమైన కోటప్పకొండ, నాగార్జునకొండ, గుత్తికొండ బిలం మరియు ఎత్తిపోతల జలపాతం, కొండ‌వీడు కోట‌ వంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కారంపూడి వీరుల ఆరాధన వంటి సాంస్కృతిక ఉత్సవాల ద్వారా పల్నాటి వీర చరిత్రను భవిష్యత్ తరాలకు అందిస్తూ, పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఈ విధంగా అన్ని రంగాలను సమన్వయం చేసుకుంటూ, స్థానిక నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పల్నాడు జిల్లా రాష్ట్రాభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూ ప్రగతి పథంలో సగర్వంగా ము ముందుకు సాగుతోంది.

May-31-Success-Story : యువ‌త‌కు ఉపాధి భరోసా

పల్నాడు జిల్లా సాధిస్తున్న ఈ సర్వతోముఖాభివృద్ధి ఇక్కడి యువత పాలిట సరికొత్త ఉపాధి కల్పనా వనరుగా మారుతోంది. జిల్లాలో విస్తరిస్తున్న పారిశ్రామికీకరణ, ముఖ్యంగా పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి ప్రాంతాల్లోని సిమెంట్ పరిశ్రమల విస్తరణ, అనుబంధ తయారీ యూనిట్ల ఏర్పాటు వల్ల వేలాది మంది స్థానిక యువతకు నేరుగా ఫ్యాక్టరీలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా, వాణిజ్య పంటలైన మిరప, పత్తి మార్కెట్ రంగంలో ఆధునిక కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, లాజిస్టిక్స్ రంగాలు తోడవడంతో గ్రామీణ యువతకు సొంత ఊళ్లలోనే ఉపాధి మార్గాలు మెరుగవుతున్నాయి. మరోవైపు, మౌలిక వసతుల కల్పనలో భాగంగా జరుగుతున్న రహదారుల విస్తరణ, రవాణా రంగాల అభివృద్ధి వల్ల వ్యాపార, వాణిజ్య సముదాయాలు పెరిగి సెల్ఫ్-ఎంప్లాయిమెంట్ (స్వయం ఉపాధి) వైపు అడుగులు వేసే యువతకు మంచి ప్లాట్‌ఫారమ్ దొరుకుతోంది. కోటప్పకొండ, ఎత్తిపోతల జలపాతం వంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి స్థానిక హోటల్ రంగం, గైడింగ్, రవాణా సేవల రూపంలో మరికొందరికి జీవనోపాధిని అందిస్తోంది. విద్యా, వైద్య రంగాలలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్స్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో చదువుకున్న యువతకు కొలువులు దక్కుతున్నాయి. గతంలో ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి నుంచి, నేడు పల్నాడు జిల్లాలోనే లభిస్తున్న ఈ బహుముఖ అవకాశాల వల్ల యువత ఆర్థికంగా స్థిరపడుతూ జిల్లా ప్రగతిలో భాగస్వాములవుతున్నారు.

May-31-Success-Story : ఫారిన్​ బెల్ట్​ గా పల్నాటి సీమ

May-31-Success-Story

నాడు పల్నాడు అంటే భయం, వలసలు, అంతులేని కన్నీళ్లు. కానీ నేడు పల్నాడు అంటే అభివృద్ధి, ఐటీ కొలువులు, ఆధునిక ఉపాధి అవకాశాలు. కక్షల కంటే చదువే జీవితాలను మారుస్తుందని గ్రహించిన ఇక్కడి సమాజంలో వచ్చిన చైతన్యమే ఈ మహా మార్పునకు కారణం. ఒకప్పుడు పులిపాడు, దైద వంటి గ్రామాలను ‘పంజాబ్ బెల్ట్’ అని భయంతో పిలిచిన నోళ్లే… నేడు వందలాది మంది విదేశాల్లో స్థిరపడి జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్న తీరును చూసి అబ్బురపడుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు, సిమెంట్ పరిశ్రమలు, సూపర్ స్పెషాలిటీ వైద్యం, పర్యాటక రంగాల విస్తరణతో పల్నాడు యువత వలసల బాట వీడి సొంత గడ్డపైనే స్వయం సమృద్ధి సాధిస్తోంది. నెత్తుటి మరకల చరిత్రను శాశ్వతంగా చెరిపేసి, రాబోయే తరాలకు సరికొత్త విద్యా, ఉపాధి వెలుగులను పంచుతూ, ఆంధ్రప్రదేశ్‌లోనే పల్నాడు జిల్లా ఒక రోల్ మోడల్‌గా నిలుస్తూ సగర్వంగా మున్ముందుకు సాగుతోంది.

ALSO READ : NH 544D Palnadu Highway పల్నాడు హైస్పీడ్​ Andhra Prabha Top Story

Leave a Reply