సమస్యల పరిష్కారానికి వేగం పెంచాలి..

సమస్యల పరిష్కారానికి వేగం పెంచాలి..

ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి అవసరం

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు.

సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టం-పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహంతో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 124 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పోలీస్ శాఖకు 24, రెవెన్యూ 23, ఎంఏయూడీకి 14, పంచాయతీరాజ్‌కు 11, సాంఘిక సంక్షేమ శాఖకు 9, విద్యా శాఖకు 8, పౌర సరఫరాలకు 6, డీఆర్‌డీఏకు 5, ఉపాధి కల్పనకు 4 అర్జీలు అందాయి. అలాగే ఏపీ సీపీడీసీఎల్‌కు 3, వైద్య, గ్రామీణ నీటి సరఫరా, విభిన్న ప్రతిభావంతులు, సహకార, కార్మిక శాఖలకు 2 చొప్పున అర్జీలు అందగా, హౌసింగ్, రోడ్లు మరియు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, అటవీ, వక్ఫ్ బోర్డు, ప్రజా రవాణా, దేవదాయ శాఖలకు ఒక్కో అర్జీ స్వీకరించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలను పాటిస్తూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.