మరణం కూడా వేరు చేయలేకపోయింది
మరణం కూడా వేరు చేయలేకపోయింది
భర్త మృతితో గంటల వ్యవధిలో భార్య మృతి.. సుందరయ్యనగర్లో విషాదం
పాయకాపురం, ఆంధ్రప్రభ: మరణం కూడా వేరు చేయలేదన్న రీతిలో భార్యాభర్తలు గంటల వ్యవధిలో మృతి చెందిన ఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సుందరయ్యనగర్లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది.
సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన చుక్కా ఏలియా (55) గుండెపోటుతో మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన ఆయన భార్య ఎల్లాయమ్మ (50) కూడా కొద్ది గంటల వ్యవధిలో గుండెపోటుతో మృతి చెందారు. భార్యాభర్తలు ఇలా ఒకరి వెంట మరొకరు మరణించడంతో ఆ ప్రాంత ప్రజలు షాక్కు గురయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో వారి ఇంటికి చేరుకుని పార్థివ దేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. భార్యాభర్తల మరణంతో సుందరయ్యనగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చుక్కా ఏలియా, ఎల్లాయమ్మ పార్థివ దేహాలకు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బత్తుల కొండా, భీమన ఆంజనేయులు, దుర్గాసి రాము, మోతుకూరి ఖాసిమ్, లబ్బ వైకుంఠం, కోలా శ్రీను, ఉప్పతల దుర్గారావు, చుక్కా ప్రసాద్, రజిని, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
