ఆరోపణలు కాదు..ఆధారాలు చూపండి..

కృష్ణా మిల్క్ యూనియన్‌పై దుష్ప్రచారం..
ఆధారాలుంటే నిరూపించండి!
వీరవల్లి ప్లాంట్ నిర్మాణం నుంచి కొనుగోళ్ల వరకు ప్రతి రూపాయి లెక్కలతోనే ఖర్చు చేశాం..
రూ.183 కోట్ల అత్యాధునిక ప్రాజెక్టు పూర్తిగా టెండర్ల ద్వారానే..
కేంద్రం రూ.10 కోట్ల గ్రాంట్ మంజూరు చేసింది..
రూ.6.53 కోట్ల బకాయిని తప్పించుకునే ఎత్తుగడ
ఎన్నికల ముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్న కొందరు వ్యక్తులు
దేశంలోనే అత్యధిక బోనస్ ఇస్తున్న యూనియన్..
రైతు సంక్షేమ పథకాలతో ఆదర్శంగా కృష్ణా మిల్క్ యూనియన్
అవాస్తవ ప్రచారాలతో యూనియన్ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నం..
వారిపై పరువునష్టం, క్రిమినల్ చర్యలకు సిద్ధం..
కృష్ణ మిల్క్ యూనియన్ ఎండి, డైరెక్టర్లు

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కృష్ణా మిల్క్ యూనియన్‌పై ఇటీవల కొందరు చేస్తున్న అవినీతి, అక్రమాలు, కొనుగోళ్లలో అవకతవకలు, వీరవల్లి ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను యూనియన్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. యూనియన్ అభివృద్ధి, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ఎన్నికల ముందు కావాలనే దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించింది. వీరవల్లి ప్లాంట్ నిర్మాణం, భూముల కొనుగోలు, వెన్న, పాలపొడి కొనుగోళ్లు, అన్ని ఆర్థిక లావాదేవీలు సర్వసభ్య సమావేశాల ఆమోదం, టెండర్ విధానం, సాంకేతిక కమిటీలు, బోర్డు నిర్ణయాల ప్రకారమే జరిగాయని స్పష్టం చేసింది.

ఆరోపణలు చేసే వారి వద్ద ఆధారాలేమీ లేవని, తమ వద్ద మాత్రం ప్రతి అంశానికి సంబంధించిన అధికారిక పత్రాలు, తీర్పులు, లెక్కలు సిద్ధంగా ఉన్నాయని కృష్ణా మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర్‌బాబు, డైరెక్టర్ల లు మీడియా సమావేశంలో వెల్లడించారు. కృష్ణ మిల్క్ యూనియన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ కొల్లి ఈశ్వర్‌బాబు మాట్లాడుతూ, వీరవల్లి ప్రాజెక్టు యూనియన్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రాజెక్టు కామధేను అని పేర్కొన్నారు. 2023లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని తెలిపారు.

దక్షిణ భారతదేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా పాల ప్రాసెసింగ్ వ్యయం లీటరుకు సుమారు రూ.1.20 మేర తగ్గుతుందని వివరించారు. గతంలో రోజుకు 80 వేల కిలోల పెరుగు విక్రయాలు ఉండగా ప్రస్తుతం 2.20 లక్షల కిలోలకు పెరిగాయని, రోజువారీ పాల విక్రయాలు 3.70 లక్షల లీటర్ల నుంచి 6.50 లక్షల లీటర్లకు చేరడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీరవల్లి ప్లాంట్ నిర్మించామని చెప్పారు. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ అంచనా వేసిన రూ.185 కోట్ల వ్యయానికి బదులుగా కేవలం రూ.183 కోట్లలోనే ప్రాజెక్టును పూర్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్ల ప్రోత్సాహక గ్రాంట్ కూడా మంజూరు చేసిందని తెలిపారు.

బుడమేరు వరదల కారణంగా విజయవాడ ప్లాంట్ 42 రోజుల పాటు నిలిచిపోయిన సమయంలో వీరవల్లి ప్లాంట్ యూనియన్‌ను నిలబెట్టిందని, అది లేకపోతే యూనియన్ భవిష్యత్తే సంక్షోభంలో పడేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్లాంట్‌పై అక్రమాల ఆరోపణలు చేయడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. వెన్న, పాలపొడి కొనుగోళ్లలో కూడా ఎలాంటి అక్రమాలు లేవని, మార్కెట్ అవసరాలు, సాంకేతిక కమిటీ, కొనుగోలు కమిటీ సిఫార్సుల మేరకే కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. మార్కెట్ విస్తరణ కారణంగానే భారీ మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నామని, అందువల్లే యూనియన్ టర్నోవర్ రూ.700 కోట్ల నుంచి రూ.1,300 కోట్లకు పెరిగిందని వివరించారు.

దేశంలోనే అత్యధిక పాల సేకరణతో పాటు ప్రతి నాలుగు నెలలకు రైతులకు బోనస్ అందిస్తున్న ఏకైక పాల సహకార సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ మాత్రమేనని పేర్కొన్నారు. రైతు మరణిస్తే రూ.50 వేల ఆర్థిక సాయం, ప్రమాద బీమా, ఆరోగ్య పరీక్షలు, వైద్య శిబిరాలు, బంగారం పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. యూనియన్ డైరెక్టర్లు మాట్లాడుతూ, యూనియన్‌పై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి యూనియన్‌కు రూ.6.53 కోట్ల బకాయిదారుడని, ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆర్బిట్రేషన్ స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు.

ఎన్నికల ట్రిబ్యునల్ కూడా అతని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన ఎన్నికల అధికారిని సమర్థించిందని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారీ యూనియన్‌ను అస్థిరపరచడం, బకాయి చెల్లింపులను తప్పించుకోవడమే లక్ష్యంగా ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. యూనియన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా నిరాధార ప్రచారం చేసే వారిపై ఇప్పటికే జనరల్ బాడీ అనుమతితో పరువునష్టం దావాలు, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్లు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలు, యూనియన్ అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ముందుకు సాగుతున్న సంస్థపై అసత్య ప్రచారాలను ప్రజలు విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు.