Vijayawada | ఇంద్రకీలాద్రిపై బారులు తీరిన భక్తులు
- సామాన్య భక్తులకు ప్రాధాన్యం
- వీఐపీ, అంతరాలయ దర్శనాల తాత్కాలిక నిలిపివేత
- సారె, చీరల సమర్పణతో వెల్లివిరిసిన భక్తి
- ఈఓ వి.కె. శీనా నాయక్ పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారి దర్శనానికి శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మారుమోగగా, ఆలయం భక్తజన సందోహంతో కళకళలాడింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో దర్శన ఏర్పాట్లు సజావుగా సాగాయి.
వీఐపీ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్..
సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు అదే సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీంతో సాధారణ భక్తులు వేగంగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం లభించింది.

వైభవంగా ఆషాడ సారె..
ఆలయంలో నిర్వహించిన అమ్మవారి సారె, చీరల సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మొబైల్ వాహనాల ద్వారా నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు.
అన్నప్రసాద భవనంలో భక్తులందరికీ సరిపడా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీపై ఈఓ వి.కె. సీనా నాయక్ కంట్రోల్ రూమ్ నుంచి వైర్లెస్ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలోని అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ దర్శన ఏర్పాట్లను సమన్వయం చేశారు. దీంతో భక్తుల దర్శనం ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిందని దేవస్థానం అధికారులు తెలిపారు.

