Janasena | జగన్ టూర్‌పై జనసేన ఫైర్
- ఉత్తరాంధ్రలో అలజడి సృష్టించేందుకే జగన్ పర్యటన..
- మహిళా పోలీస్ అధికారిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- ఎమ్మెల్యే పంతం నానాజీ, ఏపీ ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు
మంగళగిరి, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం పర్యటనకు ముందు ఉత్తరాంధ్రలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ పర్యటన చేపట్టారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆరోపించారు. మహిళా పోలీస్ అధికారి ప్రవళికపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఆమెపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహిళా ఎస్సైపై దాడి దురదృష్టకరం
మహిళా పోలీస్ అధికారి ప్రవళికను చుట్టుముట్టి దాడికి యత్నించడం రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తోందన్నారు. విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ అధికారిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
‘చంచల్‌గూడలో 16 నెలలు ట్రైనింగ్ తీసుకున్న జగన్’
జగన్మోహన్ రెడ్డి 16 నెలలు చంచల్‌గూడ జైలులో గడిపారని, అనంతరం తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో వేలాది మంది నేరప్రవృత్తి కలిగిన వారిని తయారు చేశారని పంతం నానాజీ విమర్శించారు. నేరాలకు అలవాటుపడిన వారిని అదుపులో ఉంచేందుకు అవసరమైతే చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షాలు వ్యవహరించేవని, ప్రస్తుతం నేరస్థులే ప్రతిపక్ష నాయకులుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
పరామర్శ పేరుతో రాజకీయ కుట్ర
మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వెళ్తున్నానని చెప్పిన జగన్ చివరకు ఆయనను కలవలేదన్నారు. ములాఖత్ సమయం ముగిసిందని చెప్పడం మాజీ ముఖ్యమంత్రికి తగిన సమాధానం కాదని విమర్శించారు. నిజంగా పరామర్శ ఉద్దేశమే ఉంటే మరుసటి రోజు అయినా కలిసేవారని, కానీ ప్రధానమంత్రి మోదీ భోగాపురం పర్యటనకు ముందు ఉత్తరాంధ్రలో ఉద్రిక్తతలు సృష్టించడమే అసలు లక్ష్యమని ఆరోపించారు.
జగన్ వైఖరిపై విమర్శలు
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ప్రమాదానికి కారణమైన వ్యక్తికి మద్దతుగా మాట్లాడడం జగన్ నైజమని నానాజీ విమర్శించారు. సొంత చెల్లెలు అనారోగ్యానికి గురైనా పరామర్శించని వ్యక్తి, ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నారని అన్నారు.
అంబటి రాంబాబు తీరుపై మండిపాటు
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసులను తోసివేయడం, వారితో అనుచితంగా ప్రవర్తించడం బాధ్యతారాహిత్యమన్నారు. అంబటి ప్రవర్తనను సొంత పార్టీ నాయకులే తప్పుబడుతున్నారని, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని చెప్పారు.
‘నేరస్థులకు వైసీపీ అండ’
వైసీపీ నేరాలకు పాల్పడిన వారిని ప్రోత్సహించే పార్టీగా మారిందని పంతం నానాజీ ఆరోపించారు. ఎస్సీ వ్యక్తికి శిరోముండనం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తోట త్రిమూర్తులను పార్టీలో చేర్చుకోవడం, ఆయన నివాసంలో సమావేశాలు నిర్వహించడం, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబుకు మద్దతు ఇవ్వడం వంటి ఘటనలు దీనికి ఉదాహరణలని పేర్కొన్నారు. నేరస్థులను సమర్థించే రాజకీయాలకు ప్రజలు తగిన సమయంలో గట్టి తీర్పు ఇస్తారని అన్నారు.
‘వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావు’
ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన 11 స్థానాలు కూడా దక్కే పరిస్థితి ఉండదని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ పాలనను తిరస్కరించారని, రానున్న ఎన్నికల్లో మరింత స్పష్టమైన తీర్పు ఇస్తారని అన్నారు.
