రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి..
తొర్రూరు, ఆంధ్రప్రభ : ఆర్టీసీలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు ఆర్టీసీ సంస్థ ఇవ్వాల్సిన పాత బకాయిలను చెల్లించాలని తొర్రూరు డిపో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు సోమవారం ఆర్టీసీ డిపో ముందు నిరసన చేసి, డిపో మేనేజర్ పద్మావతికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొర్రూరు డిపోలో వివిధ హోదాలలో పనిచేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించి డిపో అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పాటు అందించిన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
రిటైర్డ్ అయిన తర్వాత 2017 నుండి రావాల్సిన ఆర్ పిఎస్ అరియర్స్ ఇప్పటి వరకు 9 సంవత్సరాల కాలం సెటిల్మెంట్లు సకాలంలో రాక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 2017 అరియర్స్ 2024 ఏప్రిల్ వరకు రావాల్సిన గ్రాడ్యుటి, లీవ్ ఎన్కౌస్మెంట్ డిఫరెన్స్ డబ్బులు చెల్లించలేదని, వీటికి తోడు అరకొర పెనన్ పత్రాలలో కొన్ని సూక్ష్మ లోపాలు ఉన్నాయని, వాటిని ఈపీఎఫ్ఓ వారు తిరస్కరణకు గురిచేసి ఇబ్బందులు పెడుతున్నారని,డీడీలు చెల్లించిన కొందరికి హయ్యర్ పెన్షన్ 20 నెలలు గడిచినను ఇంకా మంజూరు చేయడం లేదని అన్నారు.
2013-17 వేతన వివరాలు ఈపీఎఫ్ఓకు పంపకుండా పెన్షన్ పెరిగే అవకాశం లేకుండా చేయడం వల్ల పూర్తిగా నష్టపోతున్నామని, ఆర్టీసీ లోన్ రిటైర్డ్ ఉద్యోగులు అప్పులు తీరక అధిక వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని, 2025 నవంబర్ నుండి వారికి చెల్లించాల్సిన గ్రాట్యూటీ సెటిల్మెంట్ శాలరీ ఇంతవరకు చెల్లించలేదని, పిఎఫ్ కు సంబంధించిన డీడీలు చెల్లించి పిఎఫ్ పెన్షన్ రానివారు పెన్షన్ పత్రాలు తిరస్కరణ గురైన వారు ఇబ్బందులు పడుతున్నారని, తార్నాక మెడికల్ సౌకర్యాల విషయంలో కానీ, సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణానికి అనుమతి కూడా ఇవ్వడం లేదని వాపోయారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో 70 మంది ఆర్టిసి విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
