భోగాపురం ఎయిర్పోర్ట్ దేశానికే తలమానికం
- కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంకల్పానికి స్వర్ణ యుగం, చిరునామా
- ప్రధాని మోదీ సభను విజయవంతం చేద్దాం
- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
విజయనగరం (భోగాపురం), ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే కూటమి ప్రభుత్వ సంకల్పానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చిరస్మరణీయ చిహ్నంగా నిలవబోతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేయడం రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన చారిత్రక ఘట్టమని అన్నారు.
ప్రధాని మోదీ సభా వేదిక వద్ద బ్యూటిఫికేషన్, క్లీన్ అండ్ గ్రీన్ పనులను పరిశీలించిన మంత్రి మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
గత వైసిపి ప్రభుత్వంలో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రం… నేడు ప్రపంచ పెట్టుబడిదారులు ఎదురుచూసే రాష్ట్రంగా మారిందంటే అది కూటమి ప్రభుత్వ పనితీరు వల్లేనని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సమిష్టి కృషితో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి బాటలో పరుగులు తీస్తోందని పేర్కొన్నారు.

భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం విమానాశ్రయం మాత్రమే కాదని, ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్‌వే అని అన్నారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు మార్గం సుగమం కావడంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, పర్యాటకం, హోటల్ రంగాల్లో భారీ వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, స్థానిక వ్యాపారులకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా చేరవేయడంలో ఈ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని, విశాఖ–విజయనగరం–శ్రీకాకుళం ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.
గతంలో అవకాశాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్… నేడు అవకాశాలను సృష్టించే ఆంధ్రప్రదేశ్‌గా మారింది. గతంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వీడితే… నేడు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నాయి. గతంలో యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది… ఇప్పుడు ఉద్యోగాలే ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయి. ఇదే కూటమి ప్రభుత్వ పాలనకు నిదర్శనం అని మంత్రి సుభాష్ అన్నారు.
రాష్ట్రంలో పోలవరం, రాజధాని అమరావతి, పోర్టులు, రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, విమానాశ్రయాలు వంటి కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తూ ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ ప్రపంచ స్థాయికి చేరుతుందని, ఇది భావితరాలకు అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడుల ద్వారాలను తెరిచే చారిత్రక ప్రాజెక్టుగా నిలుస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.
ఆగస్టు 1న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు ప్రజలు, యువత, రైతులు, మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి చారిత్రాత్మక విజయంగా నిలపాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్,బాలగ ప్రవీణ్,ఏసీఐ, నరసన్నపేట, అప్పికొండ మోహన్ సత్య గణేష్, పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సభ్యుడు, ఉమ్మిడి సుజాత, రాష్ట్ర కార్యదర్శి,మటం శాంత కుమారి,జిల్లా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.
