ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

  • మంత్రుల బృందంతో విస్తృతంగా పర్యటించిన
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
  • ఫుడ్ పాయింట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణపై మంత్రి అచ్చెన్నాయుడు విస్తృతంగా చర్చ
  • ఐదు జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు

భోగాపురం, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన నేపథ్యంలో భీమిలి–తగరపువలస ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ పాయింట్లు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రులు కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఫుడ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

సభకు హాజరయ్యే ప్రజలకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫుడ్ పాయింట్‌లో ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఈ సందర్భంగా భీమిలి ఆర్‌డీపీ హైస్కూల్, ఆనందపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పెదిపాలెం చెన్ కన్వెన్షన్, గంభీరం ఏఐ అమీర్ కాలేజ్, తగరపువలస ఆర్టీసీ గ్రౌండ్, ప్రైవేట్ లేఅవుట్లు, ఆర్‌డీపీహెచ్‌ఈడీ పరిధిలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ పాయింట్లను పరిశీలించి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

అనంతరం వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, రహదారుల సౌకర్యాలు, ప్రజలకు కల్పిస్తున్న మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు. ఐదు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు, రవాణా, విద్యుత్, జీవీఎంసీ అధికారులకు ఆదేశించారు.

ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రతి ఏర్పాటును పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఫుడ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.