సైకిల్‌పై హోంమంత్రి అనిత..
సైకిల్‌పై హోంమంత్రి అనిత..
ఫైర్ స్టేషన్‌కు సైకిల్ పై చేరుకున్న హోం మంత్రి అనిత
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చదనానికి ప్రాధాన్యం
ఆటోనగర్ ఫైర్ స్టేషన్లో మొక్కలు నాటి సందేశం
అత్యవసర సేవల సన్నద్ధతపై సమీక్ష
అగ్నిమాపక సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం విజయవాడ ఆటోనగర్ ఫైర్ స్టేషన్‌ను సందర్శించి పర్యావరణ పరిరక్షణకు తన మద్దతును చాటిచెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సైకిల్‌పై ప్రయాణించి ఫైర్ స్టేషన్‌కు చేరుకోవడం విశేషంగా నిలిచింది. ఫైర్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.

వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్య నియంత్రణ, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఫైర్ స్టేషన్‌లోని అత్యవసర సేవల సన్నద్ధతను హోం మంత్రి సమీక్షించారు. అగ్నిప్రమాదాల సమయంలో వినియోగించే వాటర్ టెండర్లు, అత్యాధునిక అగ్నిమాపక పరికరాలు, రక్షణ సామగ్రి పనితీరును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

అగ్నిమాపక శాఖ ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న మంత్రి, సిబ్బంది ఎలాంటి అలసత్వానికి తావులేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సేవా దృక్పథంతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి. వెంకట రమణ, అడిషనల్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు, ఎన్టీఆర్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఏ.వి. శంకరరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


