ఆర్వీఎం, ఎయిమ్స్ ఆస్పత్రులకు బస్సు సర్వీసులు ప్రారంభించాలి
ఆర్వీఎం, ఎయిమ్స్ ఆస్పత్రులకు బస్సు సర్వీసులు ప్రారంభించాలి
మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు బీజేపీ వినతిపత్రం
మేడ్చల్, ఆంధ్రప్రభ : వంటిమామిడిలోని ఆర్వీఎం ఆస్పత్రి, బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రులకు మేడ్చల్ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని కోరుతూ బీజేపీ నాయకులు గురువారం మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేడ్చల్ పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసర వైద్య సేవల కోసం నిత్యం ఆర్వీఎం, ఎయిమ్స్ ఆస్పత్రులకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారని తెలిపారు. అయితే ఈ మార్గాల్లో తగిన బస్సు సౌకర్యం లేకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి అదనపు ఆర్థిక భారం భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించే ఈ రెండు ఆస్పత్రులకు నేరుగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమస్యపై డిపో మేనేజర్ స్పందించిన తీరుపై బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల అవసరాలను విస్మరిస్తే ఆర్టీసీపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని పేర్కొన్నారు.
పేద ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఈ రూట్లలో బస్సు సర్వీసులు ప్రారంభించాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ ప్రధాన కార్యదర్శులు సి.హెచ్. శ్రీనివాస్ గౌడ్, జాకట్ ప్రేమ్ దాస్, మహేష్, పార్టీ కార్యదర్శి విష్ణుమూర్తి గౌడ్, సీనియర్ నాయకులు వంశీధర్ రెడ్డి, జిల్లా బీజేవైఎం కార్యదర్శి రాఘవ రెడ్డి, గొప్ప నాగరాజు, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
