విజయవాడ ఆర్డీవోగా వెన్నెల శ్రీను..

ఆంధ్రప్రభ, విజయవాడ ; విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూతన రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీవో) వెన్నెల శ్రీను బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన, ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ సమస్యలు, ఆదాయ ధృవపత్రాలు, ప్రభుత్వ సేవల అందజేత వంటి అంశాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతిపత్రాల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా స్పందించాలని, కార్యాలయ పనితీరులో జవాబుదారీతనం ఉండాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన ఆర్డీవోకు శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు. వెన్నెల శ్రీను బాధ్యతల స్వీకారంతో విజయవాడ రెవెన్యూ పరిపాలనకు మరింత వేగం, ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త దిశ లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
