సెంచరీతో చెలరేగిన హిమకర్.. ఫైనల్లోకి సింహాద్రి వైజాగ్ లయన్స్
- క్వాలిఫయర్-2లో అమరావతిపై ఘన విజయం..
- టైటిల్ పోరులో భీమవరం బుల్స్‌తో అమీతుమీ
ఆంధ్రప్రభ, విజయవాడ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2026 సీజన్-5లో సింహాద్రి వైజాగ్ లయన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళగిరి వేదికగా సోమవారం జరిగిన క్వాలిఫయర్-2లో క్యాపిటల్ అమరావతి రాయల్స్‌పై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెంచరీతో చెలరేగిన హిమకర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం జరిగే ఫైనల్లో సింహాద్రి వైజాగ్ లయన్స్.. భీమవరం బుల్స్‌తో తలపడనుంది.
టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ హిమకర్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి కేవలం 53 బంతుల్లోనే 115 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ రికీ భూయ్ 24 బంతుల్లో 45 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు), హనీష్ వీరారెడ్డి 29 బంతుల్లో 44 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్సర్) చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. నిర్ణీత 20 ఓవర్లలో వైజాగ్ లయన్స్ 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అమరావతి బౌలర్లలో బండారు అయ్యప్ప నాలుగు వికెట్లు, వెంకట శశికాంత్ ఒక వికెట్ తీశారు.
244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాపిటల్ అమరావతి రాయల్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించినా.. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించినా ఆ ఊపు కొనసాగలేదు. కరన్ షిండే 21 బంతుల్లో 46 పరుగులు (9 ఫోర్లు, 1 సిక్సర్), ఎస్.వి. రాహుల్ 33 బంతుల్లో 48 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే పోరాడగా, మిగిలిన బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. దీంతో అమరావతి జట్టు 19.1 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది.
వైజాగ్ బౌలర్లలో గిరినాథ్ రెడ్డి, శ్రీకాంత్ తలో నాలుగు వికెట్లు పడగొట్టి అమరావతి బ్యాటింగ్‌ను కుప్పకూల్చగా, కమరుద్దీన్ రెండు వికెట్లు సాధించాడు.
సెంచరీతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చిన హిమకర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక మంగళవారం సాయంత్రం 7 గంటలకు జరిగే ఫైనల్లో సింహాద్రి వైజాగ్ లయన్స్–భీమవరం బుల్స్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
