28th Division | రంజాన్ తోఫా పంపిణీ…

28th Division | రంజాన్ తోఫా పంపిణీ…

సెంట్రల్ నియోజకవర్గంలో వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం..
ఎమ్మెల్యే బొండా ఉమా

28th Division | పాయకాపురం, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమా మహేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొని పేద మైనార్టీ కుటుంబాలకు తోఫా కిట్లు అందజేశారు. ఆదివారం 28వ డివిజన్ భాను నగర్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా 28వ డివిజన్‌లో 100 మైనార్టీ కుటుంబాలకు, అలాగే 29వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరో 500 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులు, సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రతి కుటుంబానికి శాంతి, సంతోషం, సమృద్ధి తీసుకురావాలని, అల్లాహ్ ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఎల్లప్పుడూ మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మైనార్టీల అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. ముఖ్యంగా మసీదుల్లో సేవలందించే ఇమాములు, మౌజిన్లకు జీతాలు అందించే కార్యక్రమాన్ని మొదటిగా ప్రారంభించినట్లు గుర్తుచేశారు. మైనార్టీ పిల్లలు మెరుగైన విద్యను పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబాల్లో ఉన్న పిల్లల సంఖ్య ఆధారంగా తల్లులకు ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

మహిళల సంక్షేమం కోసం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వృద్ధులకు అందించే పింఛన్లను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచామని వివరించారు. అదేవిధంగా అన్న క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరలో భోజనం అందించే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 15 వేల ముస్లిం మైనార్టీ కుటుంబాలు నివసిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

రంజాన్ పండుగను వారు ఆనందంగా జరుపుకునేందుకు ప్రతి సంవత్సరం పార్టీ నాయకులు తమ స్వంత నిధులతో సహాయం అందిస్తున్నారని చెప్పారు. మైనార్టీ సోదరులు సంతోషంగా పండుగ జరుపుకునేలా ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply