Heatwaves in Europe | భగ్గుమంటున్న ఐరోపా…
- నిప్పుల కొలిమిలా జర్మనీ..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత..
- బెంబేలెత్తుతున్న ప్రజలు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఐరోపా ఖండంలో భానుడు భగభగలాడుతున్నాడు. ముఖ్యంగా జర్మనీలో ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా రికార్డులను తిరగరాస్తోంది. జూన్ చివరి వారంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు జర్మనీ దేశం నిప్పుల కొలిమిలా మారింది. గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తీవ్రమైన వడగాడ్పుల (Heatwave) కారణంగా ఐరోపా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,300 మందికి పైగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ఎండల తీవ్రతకు ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్ దేశాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఐరోపాలోని ఇళ్లు, కార్యాలయాలు సాధారణంగా చలి వాతావరణాన్ని తట్టుకునేలా నిర్మించడం, అక్కడ కేవలం 7 నుండి 10 శాతం ఇళ్లలోనే ఎయిర్ కండిషనర్లు (AC) ఉండటంతో మరణాల తీవ్రత ఎక్కువగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు అత్యవసర చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు..
పోలాండ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కోస్చెన్ (Coschen) అనే సిటీలో అత్యధికంగా 41.7°C (107.1°F) ఉష్ణోగ్రత నమోదైనట్టు జర్మనీ వాతావరణ శాఖ (DWD) వెల్లడించింది. జర్మనీ చరిత్రలోనే ఇది అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా దాదాపు 250కి పైగా వాతావరణ కేంద్రాల్లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి ఎండలు నమోదయ్యాయి. కేవలం పగటి పూట మాత్రమే కాకుండా, రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే తగ్గకపోవడంతో (Tropical Nights) ప్రజలకు కనీస ఉపశమనం లభించడం లేదు.
అతలాకుతలమవుతున్న మౌలిక సదుపాయాలు
తీవ్ర ఎండల ప్రభావం యూరప్‌లోని మౌలిక సదుపాయాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా రైల్వే పట్టాలు వంగిపోవడం, ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు దెబ్బతినడం వల్ల పలు ప్రాంతాల్లో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు నీటి కొరత మరింత తీవ్రం కాకుండా ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని స్థానిక మున్సిపల్ సంస్థలు సూచిస్తున్నాయి. ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిర్వహించాల్సిన ప్రతిష్ఠాత్మక ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్ పోటీలను కూడా ఎండ తీవ్రత కారణంగా నిర్వాహకులు కుదించిన మార్గంలో నిర్వహించాల్సి వచ్చింది.

జర్మనీలోని బెర్లిన్‌ను పశ్చిమ ప్రాంతాలతో అనుసంధానించే కీలక ఏ2 మోటార్‌వేలో పలుచోట్ల రహదారులు పగిలిపోవడంతో అధికారులు కొన్ని జంక్షన్‌లను మూసివేశారు. బ్రాండెన్‌బర్గ్ రాష్ట్రంలోని జీసార్ ప్రాంతంలో రోడ్డు ఉపరితలం పూర్తిగా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
అధిక ఉష్ణోగ్రతలతో జర్మనీలోని లైప్‌జిగ్ నగరంలో ట్రామ్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లపై వేసిన తారు, బిటుమెన్ కరిగిపోవడంతో ప్రజారవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. బెర్లిన్‌లో ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు పోలీసులు సాధారణంగా అల్లర్ల నియంత్రణ కోసం వినియోగించే వాటర్ క్యానన్లతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చల్లని నీటిని పిచికారీ చేశారు.
ఫ్రాన్స్‌లోనూ.. పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంది. తీవ్రమైన వేడి కారణంగా రహదారులు దెబ్బతినడం, విద్యుత్ అంతరాయాలు, రైళ్ల ఆలస్యాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటలీ, జర్మనీ దేశాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లు సైతం అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక కరిగిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
పొంచి ఉన్న మరో విపత్తు…
తీవ్ర వడగాడ్పుల తర్వాత మరో ప్రకృతి విపత్తు ముప్పు కూడా పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం యూరప్‌ను అతలాకుతలం చేస్తున్న ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులకు ‘ఒమేగా బ్లాక్’ (Omega Block) అనే అరుదైన వాతావరణ దృగ్విషయమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా వేడి గాలి ఒకే ప్రాంతంలో ఎక్కువ రోజులు నిలిచిపోవడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.
అయితే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అదే సమయంలో భారీ ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు, విధ్వంసకర తుఫానులు సంభవించే ప్రమాదం ఉందని జర్మనీ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీవ్రమైన వేడి తర్వాత చల్లని గాలులు ప్రవేశించడం వల్ల వాతావరణం ఒక్కసారిగా అస్థిరంగా మారి తీవ్ర ఉరుములతో కూడిన తుఫానులు ఏర్పడే అవకాశముందని తెలిపింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్థానిక యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు.
