రేపటి నుంచి ఘనంగా వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి 20వ వార్షిక త్రయాహ్నిక బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుండి 28 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈనెల 26 (ఆదివారం) రోజున ఉదయం 6:00 గంటలకు స్వామివారి నిత్య పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం మంటప ఆరాధన, స్వస్తి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకురారోపణం, ఋత్విక్ వర్ణం, బేరి పూజ, ధ్వజపటాధివాసం, ధ్వజారోహణం (సంతానం కోసం ఎదురుచూసే వారితో గరుడ పూజ), యాగశాల ప్రవేశం, ద్వారా తోరణ పూజ, అగ్ని ప్రతిష్ట, సర్వ వైదిక హోమం, లఘు పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ జరుగుతాయి. సాయంత్రం 6:00 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎదురుకోళ్ల ఉత్సవం నిర్వహిస్తారు.
ఈనెల 27 (సోమవారం) రోజున ఉదయం 6:00 గంటలకు పంచామృత అభిషేకం, 8:00 గంటలకు మంగళసూత్రం ఎదురుకోవడం, 9:00 గంటల నుండి శ్రీవారి కళ్యాణోత్సవం, స్థాలిపాక హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం 5:00 గంటలకు రథ హోమం అనంతరం రథోత్సవం నిర్వహించనున్నారు.
ఈనెల 28 (మంగళవారం) రోజున ఉదయం 6:00 గంటలకు నిత్య పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, మంటప ఆరాధన, స్థాపిత దేవత హోమం, శ్రీనివాస హోమం, మహా పూర్ణాహుతి, ఆలయ బలిహరణం, కుంభ ఉద్వాసన, మహా కుంభ ప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 6:00 గంటలకు ద్వాదశ ఆరాధన (నాగవెల్లి), పుష్పయాగం, ఊంజల సేవ, వేద ఆశీర్వచనం నిర్వహించి కార్యక్రమాలు ముగిస్తారు.
ఈ మహోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. పూజా కార్యక్రమాలు శ్రీమాన్ నేరళ్ళ నరసింహమూర్తి కౌండిన్య, శ్రీమాన్ నేరళ్ళ సందీప్ ఆచార్య కౌండిన్య ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని తెలిపారు.
