బెల్లంపల్లిలో మహేష్ స్మారక క్రికెట్ పోటీలు ప్రారంభం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎడిచెర్ల మహేష్ స్మారకార్థం బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి తిలక్ క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ హాజరై పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రికెట్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉందన్నారు. బెల్లంపల్లి పట్టణం క్రీడలకు, జాతీయ స్థాయి క్రీడాకారులకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. గెలుపు-ఓటములను సమానంగా స్వీకరించి విజయానికి కృషి చేయాలని క్రీడాకారులకు సూచించారు. ఎడిచెర్ల మహేష్ స్మారకార్థం నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

పోటీల నిర్వాహకులు ఎడిచెర్ల వంశీకృష్ణ, సుద్దాల వంశీకృష్ణ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 16 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు. విజేత జట్టుకు రూ.30 వేల నగదు, కప్, ద్వితీయ బహుమతిగా రూ.15 వేల నగదు, కప్ అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నిత్యకుల వంశీకృష్ణ, మత్తమారి రాయమల్లు రామ్మూర్తి, కాంగ్రెస్ నాయకులు జావా రమేష్ బాబు, చింతల లోకేశ్వర్, నిర్వాహకులు శివసాయి, ఎడిచెర్ల హరీష్, అన్వేష్ తదితరులు, పెద్ద సంఖ్యలో క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.

ఫ్రెండ్స్ ఎలెవన్ ఘన విజయం

పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఫ్రెండ్స్ ఎలెవన్ జట్టు అగ్రెసివ్ షూటర్స్ జట్టుపై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఫ్రెండ్స్ ఎలెవన్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్ గుడిపల్లి సాయి సచిన్ 22 బంతుల్లో 56 పరుగులు చేసి సిక్సర్లు, ఫోర్లతో ప్రేక్షకులను అలరించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అగ్రెసివ్ షూటర్స్ జట్టు 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 62 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Leave a Reply