13thMaychintana | విజయం తర్వాత వినయం ఎందుకు ముఖ్యం?

13thMaychintana | విజయం తర్వాత వినయం ఎందుకు ముఖ్యం?

13thMaychintana | ఇంద్రపదవిని సాధించిన నహుషుడు
అహంకారం తెచ్చిన పతనం
అగస్త్య మహర్షి శాపం వెనుక సందేశం
జ్ఞానం, పదవి, సంస్కారం మధ్య సంబంధం
మనస్సాక్షి గెలిచిన ప్రవచనకారుడి కథ
‘నేనూ’ నుంచి ‘నేనే’ వరకు పతన గాథ

13thMaychintana | మహాభారతం అరణ్యపర్వంలో నహుషుని ఉత్థాన పతనాలకు సంబంధించిన కథ ఒకటి కనిపిస్తుంది. విజయానికి వినయం తోడైతే అది సమగ్రతను సంతరించుకుంటుందనే సార్వకాలిక సత్యాన్ని స్పష్టంగా తెలుపుతుందది. నహుషుడు వేద వేదాంగాలను చదివాడు. పరిపాలనా దక్షునిగా ప్రఖ్యాతిని పొందాడు. యజ్ఞయాగాలను చేశాడు. వేదం అంటే జ్ఞానం. తెలుసుకోదగిన దానిని సమగ్రంగా తెలుసుకున్నాడు. అత్యున్నతమైన ఇంద్రపదవిని లక్ష్యంగా పెట్టుకున్నాడు. లక్ష్యసాధనా మార్గాలను అన్వేషించాడు, వనరులు, వసతులు సమకూర్చుకున్నాడు… వాటిని ఆచరణాత్మకంగా మలుచుకొని, అవసరమైన చోట తెలిసినవారి సహాయం తీసుకున్నాడు… లక్ష్యసాధనకు అవసరమైన వంద అశ్వమేధ యజ్ఞాలను నిర్వహించి, అత్యున్నతమైన ఇంద్రపదవిని సాధించాడు.

తదుపరి? అంతకన్నా ఉన్నత లక్ష్యాన్ని గుర్తించలేకపోవడం వల్ల అప్పటిదాకా ప్రతిభావంతము, ఉద్యమవంతమైన మనస్సు నిర్వ్యాపారమయింది. దానితో భోగాసక్తి పెరిగింది. ఆసక్తి వ్యసనంగా మారడంతో… సాధించిన విజయం అహంకారాన్ని, మదాన్ని ప్రసాదించింది. గర్వాంధుడై అన్ని రంగాలలోని వారిని తృణీకరించసాగాడు. క్రమంగా జ్ఞానం నశించి, భోగియై, చెడ్డవైన అహంకారానికి, మదానికి బానిసయై, కామాతురుడై ఉచ్చనీచాలు మరచి, ఇంద్రుడి భార్య శచీదేవిని కామించాడు. అధికార దర్పంతో సప్తఋషులను తన పల్లకీని మోయమని ఆదేశించాడు. ఋషులు పల్లకీ బరువుతో నెమ్మదిగా నడుస్తుండగా, నహుషుడు “సర్ప, సర్ప” (వేగంగా నడువు) అంటూ పల్లకీ మోస్తున్న అగస్త్య మహర్షిని కాలితో తాడిస్తాడు. దానితో కోపించిన అగస్త్యుడు “సర్పానివి కమ్మని” శపించడం, దానితో కొండచిలువగా మారి భూమిపై పడిపోయాడు. నిర్మాణాత్మకమైన వైఖరితో, సమచిత్తంతో సాధించిన లక్ష్యాన్ని… దుర్మదము, అహంకారం నిరర్థక విజయంగా మార్చి, పతనావస్థకు చేర్చింది.

అయితే సాధించిన జ్ఞానం అతనిలో వివేకాన్ని ప్రసాదించగా, ఋషులను ప్రార్థించి పూర్వజన్మ స్మృతిని, శాపవిమోచనాన్ని కోరగా, వారు అనుగ్రహిస్తారు. అలా శాపగ్రస్తుడై, విధికృతమైన దానికి భారమైనది ఏదీ లేదు అనుకుంటూ, పెద్దపాముగా మారి, దుఃఖిస్తాడు. ఒక సంస్థ సరిగా నడిచేందుకు యాజమాన్య నిర్వహణ నైపుణ్యం అవసరం. దానినే బుద్ధి అందాము. ఆ బుద్ధికి ప్రతీకలు ఋషులు… వినయంతో ప్రసన్నం చేసుకోవలసిన ఋషులను నహుషుడు అవమానించాడు. అంటే ఆలోచనా పరిణతి యొక్క సహకారాన్ని కోల్పోయాడు… ఒక సంస్థను ఉచ్చస్థితికి తీసుకువెళ్లేందుకు అవసరమైన దీక్ష, జ్ఞానం, నైపుణ్యం, తపన, పట్టుదల, ప్రణాళికా రచనా సామర్థ్యం, సాంకేతిక పరిణతి, మార్పును ఆహ్వానించే తత్త్వం, కార్య నిర్వహణా దక్షత, బృందాలను ఏర్పరచి ఒక్క త్రాటిపై వారిని నడిపే సమర్థత, అనుచరులకు ప్రేరణనిచ్చే ఉత్సాహంలాంటి లక్షణాలను నహుషుడు సంతరించుకున్నాడు కాబట్టే సమున్నత లక్ష్యాన్ని సాధించగలిగాడు. కాకపోతే అదే అంతిమమని అనుకున్నాడు… దానికి మించిన అవకాశాలను గుర్తించలేకపోయాడు.

లక్ష్యసాధనలో అవసరమైన అన్ని విభాగాలు వాటి సామర్థ్యం మేరకు వాటి పరిధుల్లో పనిచేయాలి. అన్నింటినీ సమన్వయం చేసే వ్యవస్థ దేని స్థానంలో అది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. వివేచనా రహితమై, నిర్వ్యాపారమైన మనస్సు భోగాసక్తమై, పాలనావ్యవస్థపై పట్టుకోల్పోయింది. ఒక విజయం మరొక ఉన్నత విజయానికి దారి చూపకపోతే అభివృద్ధి లేదు. అభివృద్ధి లేని మనస్సు నిర్వ్యాపారతను ఆశ్రయిస్తే అనాసక్తి ఏర్పడుతుంది. జీవన సోపానాలను చేర్చవలసిన జ్ఞానం, అహంకారానికి దారిచూపితే పతనావస్థకు చేరుతారని, నహుషుని చరిత్ర బోధిస్తుంది.

చదివిన చదువు వివేకాన్ని, ఉన్నత పదవి సంస్కారాన్ని ఇవ్వాలి. విరగకాసిన ఫలాలున్న చెట్లు వంగి ఉంటాయి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం అవసరం. కాని నహుషునిలో చదువు, పదవి అహంకారాన్ని ఇనుమడింపజేసి పతనానికి కారణమయింది. వ్యవస్థలో “నేనూ” అనుకుంటే ప్రగతి.. “నేనే” అనుకుంటే పతనం. అధికారం లభిస్తే సమచిత్తంతో గొప్పకార్యాలు చేయాలేగానీ, భోగలాలసత పెరిగి నిర్వ్యాపారాన్ని దుర్వ్యాపారంగా మార్చుకొని, దుర్మదుడై, పతనమవడం తగదని, ప్రగతి కాముకులకు హెచ్చరిక చేస్తుందీ కథ.

బాగా పేరు ప్రతిష్టలు కలిగిన ప్రవచనకారుడు ఒకరు బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. పొరపాటున కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడది గమనించి కూడా మిన్నకున్నాడు. ఇంతలో తను దిగవలసిన ఊరు వచ్చింది. అతనిలోని మనస్సాక్షి మేల్కొన్నది. దిగేటప్పుడు కండక్టరుకు పది రూపాయలు ఇచ్చి “మీరు నాకు ఎక్కువగా ఇచ్చారు” అన్నాడు. అప్పుడా కండక్టర్ “మీరు ప్రవచనాలు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను” అన్నాడు. పండితుడు బస్సు దిగుతూ “పది రూపాయలపై లోభంతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను… నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది. తప్పుడు నిర్ణయం చిన్నదైనా జీవితకాలం సంపాదించుకున్న మంచితనాన్ని సర్వనాశనం చేసేది” అనుకున్నాడు. జ్ఞానం వినయంతో కలిసినప్పుడే, పొందిన పదవి సంస్కారాన్ని ఇస్తుంది. విజయం సాధించడం కన్నా దానిని నిలబెట్టుకోవడమే మిన్న.

పాలకుర్తి రామమూర్తి

Leave a Reply