Varanasi | మహేష్ బాబు మూవీపై రాజమౌళి బిగ్ అప్‌డేట్!

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే సినిమాకి సంబందించిన టైటిల్‌ గ్లింప్స్ తో రాజమౌళి వారణాసి ఎలా ఉండబోతుందో పరిచయం చేశారు. ఓ ఇంటర్వూలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కథా ప్రపంచంపై రాజమౌళి తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇప్పటికే చిత్రీకరణలో దాదాపు 80 శాతం పూర్తయిందని, మిగిలిన భాగంలో ప్రధానంగా చిన్న సన్నివేశాలు, కథను కలిపే కీలక ఘట్టాలు ఉన్నాయని వివరించారు. ‘వారణాసి’ ఒక సాధారణ కథ కాదని, భారీ స్థాయిలో సాగే సాహస యాత్రగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని రాజమౌళి తెలిపారు. కథను పూర్తిగా వెల్లడించకుండా, ప్రేక్షకులు తెరపై అనుభవించబోయే ప్రపంచాన్ని మాత్రమే పరిచయం చేసేలా టైటిల్ గ్లింప్స్ రూపొందించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. సినిమా స్థాయికి తగ్గట్టుగా విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

ఈ సినిమా ప్రయాణం పవిత్ర నగరమైన వారణాసి నుంచి ప్రారంభమై, కాల ప్రయాణం నేపథ్యంలో వివిధ ప్రాంతాలను దాటుకుంటూ సాగుతుందని దర్శకుడు వెల్లడించారు. కథలో భాగంగా అంటార్కిటికా, ఆఫ్రికా వంటి ప్రదేశాలతో పాటు ప్రాచీన రోమ్ నేపథ్యాన్ని కూడా ప్రేక్షకులు చూడబోతున్నారని తెలిపారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా..

చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయని, పూర్తైన సన్నివేశాలను వెంటనే ఎడిటింగ్ చేసి, విజువల్ ఎఫెక్ట్స్ బృందానికి పంపుతున్నామని తెలిపారు. దీంతో నిర్మాణంలోని వివిధ విభాగాలు ఒకేసారి పనిచేస్తూ సినిమా పనులను వేగంగా పూర్తి చేస్తున్నాయని వివరించారు.

అంతర్జాతీయ స్థాయిలో ‘వారణాసి’

మహేష్ బాబు–రాజమౌళి కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా సాగే సాహస కథగా రూపొందుతున్న ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ విజువల్స్, విభిన్నమైన కథా నేపథ్యం, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.