బీఆర్ఎస్ హయాంలోనే బెల్లంపల్లి అభివృద్ధి

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై ప్రశ్నలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బెల్లంపల్లి పట్టణం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.

సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ నాయకులు సవాల్ విసరడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పాలనలో బెల్లంపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను త్వరలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల ముందుంచుతామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, విద్యావేత్తల సమక్షంలో పూర్తి ఆధారాలతో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బెల్లంపల్లికి సబ్ కలెక్టర్ కార్యాలయం, ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం, పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం, ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ కార్యాలయాలు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు బీసీ వెల్ఫేర్ బాలుర, బాలికల పాఠశాలలు, 100 పడకల ఏరియా ఆస్పత్రి, కృషి విజ్ఞాన కేంద్రం, ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడిచినా ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని చిన్నయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మెడికల్ కళాశాల ఏర్పాటు, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పరిశ్రమ స్థాపన, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడం వంటి హామీల అమలుపై సమాధానం చెప్పాలని కోరారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు నూనేటి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పోట్లపల్లి సుభాష్‌రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, నాయకులు జిల్లపల్లి వెంకటస్వామి, మచ్చ రాజేష్, రేవెల్లి విజయ్‌కుమార్, ముద్దెల గోపీకృష్ణ, ఈట రాకేష్ తదితరులు పాల్గొన్నారు.