రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న జైకిసాన్ ఫౌండేషన్

రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న జైకిసాన్ ఫౌండేషన్

గిరిజన రైతులకు ఆధునిక సాగు పరికరాలు, సజ్జ విత్తనాల పంపిణీ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: రైతు సంక్షేమమే ధ్యేయంగా జైకిసాన్ ఫౌండేషన్ పనిచేస్తోందని డాక్టర్ విజయశంకర్ బాబు పేర్కొన్నారు. గురువారం ప్రముఖ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (ఏఆర్ఎస్) రేకులకుంట సంయుక్త ఆధ్వర్యంలో ఉరవకొండ నియోజకవర్గంలోని రూపానాయక్ తండాకు చెందిన గిరిజన రైతులకు అండగా నిలిచే కార్యక్రమాన్ని నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వ ఎస్‌టీ ఉప ప్రణాళికలో భాగంగా అమలవుతున్న అఖిల భారత సజ్జ పంట సమన్వయ పరిశోధన పథకం కింద రూపానాయక్ తండాకు చెందిన 12 మంది గిరిజన రైతులకు ఆధునిక సాగు పరికరాలైన హ్యాండ్ పుష్ సీడర్లు (చేతితో నెట్టే విత్తన యంత్రాలు), అలాగే అధిక దిగుబడినిచ్చే ఏపీహెచ్‌బీ-126 సంకర సజ్జ రకం విత్తనాలు ఒక్కో రైతుకు 2 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఆర్ఎస్ రేకులకుంట కేంద్ర అధిపతి డాక్టర్ విజయశంకర్ బాబు, ప్రముఖ శాస్త్రవేత్తలు డాక్టర్ నరసింహులు, డాక్టర్ లక్ష్మన్న, డాక్టర్ భాస్కర్, డాక్టర్ నారాయణస్వామి హాజరయ్యారు. రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించి, చిరుధాన్యాల సాగుతో స్థిరమైన ఆదాయం పొందవచ్చని సూచించారు.

ఈ సందర్భంగా డాక్టర్ విజయశంకర్ బాబు మాట్లాడుతూ, ప్రస్తుత మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో, వర్షాభావ ప్రాంతాల్లో సజ్జ వంటి చిరుధాన్యాల సాగు అత్యంత లాభదాయకమని తెలిపారు. ఇవి తక్కువ నీటితో, కరువును తట్టుకుని నాణ్యమైన దిగుబడులు అందించడమే కాకుండా ప్రజలకు అవసరమైన పోషకాహార భద్రతను కల్పిస్తాయని పేర్కొన్నారు.

గిరిజన రైతులు సంప్రదాయ పద్ధతులను మాత్రమే కాకుండా ఆధునిక వ్యవసాయ పరికరాలు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.

గిరిజన రైతుల జీవనోపాధి మెరుగుదలే లక్ష్యం

జైకిసాన్ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ, వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాల రైతుల ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి మెరుగుదల, చిరుధాన్యాల సాగు విస్తరణ లక్ష్యంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

విత్తనాలు నాటేందుకు కూలీల ఖర్చు తగ్గించే హ్యాండ్ పుష్ సీడర్లు గిరిజన రైతులకు శ్రమ, సమయాన్ని ఆదా చేస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జైకిసాన్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఏఆర్ఎస్ సిబ్బంది, రూపానాయక్ తండాకు చెందిన గిరిజన రైతులు పాల్గొన్నారు. తమకు ఆధునిక పరికరాలు, నాణ్యమైన విత్తనాలు అందించినందుకు రైతులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.