కదిరి డిపో మాజీ డ్రైవర్‌కు పెన్షన్ మంజూరు చేయాలి..

కదిరి డిపో మాజీ డ్రైవర్‌కు పెన్షన్ మంజూరు చేయాలి..

  • విశ్రాంత ఉద్యోగుల పోస్టుకార్డు ఉద్యమం

కదిరిటౌన్, ఆంధ్రప్రభ : కదిరి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేసి 2019లో పదవీ విరమణ పొందిన కె. గంగప్పకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కదిరి డిపో విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన అసోసియేషన్ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ గంగప్పకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని బర్కత్‌పుర్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అధికారులకు పోస్టుకార్డులు పంపించారు. సమావేశంలో నాయకులు హరిమోహన్, బాష మాట్లాడుతూ గంగప్ప 2019లోనే పెన్షన్‌కు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించినప్పటికీ, ఈపీఎఫ్ కార్యాలయంలో ఆ పత్రాలు పోయాయని తెలిపారు.

ఇందులో గంగప్ప ఎలాంటి తప్పు చేయకపోయినా, అతనికి రావలసిన పెన్షన్‌ను ఇంతకాలం నిలిపివేయడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లుగా పెన్షన్ అందకపోవడంతో గంగప్ప తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగికి రావలసిన హక్కును నిర్లక్ష్యం చేయడం బాధాకరమని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న పెన్షన్‌ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు నరసింగరావు, అబ్బాస్, సురేంద్రరెడ్డి తదితరులు మాట్లాడుతూ గంగప్ప సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న గంగప్పకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. పోస్టుకార్డు ఉద్యమం ద్వారా ఈపీఎఫ్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, గంగప్పకు పెన్షన్ మంజూరు చేయించి అతని కుటుంబానికి అండగా నిలవాలని విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.