TransBill2026 | ‘ఎల్‌జీబీటీ’ సినిమా – ఆలోచింపజేసే ప్రయత్నం

TransBill2026 | ‘ఎల్‌జీబీటీ’ సినిమా – ఆలోచింపజేసే ప్రయత్నం
TransBill2026 | సమాజ సమస్యలపై ధైర్యమైన ప్రయత్నం
ఎల్‌జీబీటీపై అపోహలకు చెక్
ట్రాన్స్ బిల్‌పై స్పందన
TransBill2026 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ ; మన సమాజంలో ప్రతిరోజూ ఎన్నో సమస్యలు మన కళ్లముందే జరుగుతుంటాయి. కొన్ని అన్యాయాలు, కొన్ని బాధాకర సంఘటనలు ఎదురైనప్పుడు… “ఇవిపై ఎవరైనా గట్టిగా మాట్లాడితే బాగుండేది”, “ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తే మార్పు వచ్చేదేమో” అనే భావన చాలామందిలో కలుగుతుంది. సమాజంలో ఉన్న ఇలాంటి సున్నితమైన కానీ తరచూ పట్టించుకోని అంశాలను కథ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నమే దర్శకుడు సూనైటేడ్ కుమార్ చేసిన తాజా చిత్రం ‘ఎల్‌జీబీటీ’.
ప్రస్తుతం ఈ సినిమా సినీ వర్గాల్లోనే కాకుండా సామాజిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సమాజంలో ఇప్పటికీ చాలామంది సరైన అవగాహన లేకుండా చూసే ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ సినిమా ప్రధానంగా స్పృశిస్తోంది. కేవలం వినోదం కోసం కాకుండా, ఒక సందేశాన్ని అందించే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన ఇద్దరు కళాకారులు ఇటీవల ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమా వెనుక ఉన్న ఆలోచన, కథ యొక్క అవసరం, సమాజానికి చెప్పాలనుకున్న సందేశం గురించి వారు వివరించారు. ముఖ్యంగా ‘ఎల్‌జీబీటీ’ అనే పదానికి సంబంధించిన అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.
వారు మాట్లాడుతూ, ఎల్‌జీబీటీ అనేది నాలుగు వర్గాల సమాహారమని స్పష్టం చేశారు. ఎల్ అంటే లెస్బియన్, జీ అంటే గే, బీ అంటే బైసెక్సువల్, టీ అంటే ట్రాన్స్‌జెండర్ అని తెలిపారు. సమాజంలో ఈ వర్గాలపై ఇంకా సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక అపార్థాలు, వివక్షలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ వర్గాలకు కూడా సమాన హక్కులు, గౌరవం, స్వేచ్ఛ అవసరమని వారు పేర్కొన్నారు.

ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ట్రాన్స్ బిల్ 2026 గురించి కూడా వారు స్పందించారు. ట్రాన్స్‌జెండర్ల గుర్తింపు విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్లు తమను తాము నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని, తన ఉనికిని మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉండకూడదని అన్నారు.
వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా, గౌరవప్రదమైన జీవితం గడపడానికి ప్రభుత్వం మరింత సానుకూల దృక్పథంతో ఇతర మార్గాలను పరిశీలించాలని సూచించారు. చట్టాలు కేవలం పరిపాలన కోసం కాకుండా, మనుషుల గౌరవాన్ని కాపాడేలా ఉండాలని వారు అభిప్రాయపడ్డారు.
సమాజంలో ఉన్న సున్నితమైన అంశాలను స్పృశిస్తూ, అవగాహన కలిగిస్తూ, చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతోనే ‘ఎల్‌జీబీటీ’ సినిమా రూపొందుతోందని వారు పేర్కొన్నారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు… సమాజం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న అని కూడా అన్నారు.
ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఓపెన్ మైండ్‌తో చూడాలని, వినోదంతో పాటు ఒక కొత్త దృక్పథాన్ని కూడా తీసుకెళ్లాలని వారు కోరారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, వీరి పూర్తి అభిప్రాయాలు, విశ్లేషణాత్మక సమాధానాలు ఈ క్రింది వీడియోలో ఉన్నాయి. పూర్తి ఇంటర్వ్యూను తెలుసుకోవాలంటే లింక్‌పై క్లిక్ చేసి చూసేయండి మరి.
