డెల్టాకు జీవనాడిగా కృష్ణమ్మ

  • కృష్ణా డెల్టాకు నీటి విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేసిన అధికారులు
  • తూర్పు కాలువలకు 3,200 క్యూసెక్కుల సాగునీరు
  • 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు కోసం
  • 30 లక్షల మంది రైతుల అవసరాలకు
  • పట్టిసీమ జలాలతోనూ నీటి భద్రత..
  • కాలువల అభివృద్ధికి రూ.64 కోట్లతో ముందస్తు చర్యలు

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో: ఖరీఫ్‌ సీజన్‌కు శ్రీకారం చుడుతున్న కృష్ణా డెల్టా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నీటి క్యాలెండర్‌కు అనుగుణంగా బుధవారం ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 3,200 క్యూసెక్కుల సాగునీటిని అధికారికంగా విడుదల చేసింది. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనే దృక్పథంతో చేపట్టిన ఈ నిర్ణయం ద్వారా కృష్ణా డెల్టా పరిధిలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు సకాలంలో సాగునీరు అందనుండగా, సుమారు 30 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఖరీఫ్‌ సాగు సాఫీగా సాగడంతో పాటు పంటల దిగుబడులు పెరిగేందుకు ఈ నీటి విడుదల కీలకంగా మారనుంది.

బ్యారేజీ నుండి నీటి విడుదల..

ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ అధికారుల సమక్షంలో ప్రకాశం బ్యారేజ్‌లోని కృష్ణా ఈస్ట్రన్ మెయిన్ హెడ్ రెగ్యులేటర్‌ వద్ద కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాగునీటిని విడుదల చేశారు. ఇటీవల నిర్వహించిన ‘ఏరువాక పౌర్ణమి’ కార్యక్రమానికి కొనసాగింపుగా రైతులకు సమయానికి నీరందించే లక్ష్యంతో సాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘జలాధార–జలహారతి’ కార్యక్రమంలో భాగంగా డెల్టా కాలువల పూడికతీత, మరమ్మతులు, కట్టల బలోపేత పనులను ముందుగానే పూర్తి చేశారు. చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా కాలువలను సిద్ధం చేయడంతో పాటు భూగర్భ జలాల రీఛార్జ్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. కాలువల నిర్వహణ, పూడికతీత పనుల కోసం ఓ అండ్ ఎం నిధుల కింద రూ.64 కోట్లు నిధులను ఇప్పటికే విడుదల చేశారు.

త్వరగా నాట్లు పూర్తిచేసే అవకాశం..

జూలై 1 నుంచే సాగునీటిని విడుదల చేయడం వల్ల రైతులు జూలై చివరి నాటికి వరి నాట్లు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా నవంబర్‌లో సంభవించే తుఫానుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని సాగునీటి నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పులిచింతల జలాశయంలోని నీటిని సమర్థంగా వినియోగించడంతో పాటు జూలైలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించి నీటి కొరత తలెత్తకుండా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఎల్‌నినో’ ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలని అధికారులు సూచించారు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం కల్పిస్తూనే సాగునీటి పంపిణీని శాస్త్రీయంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది.