జాతీయ బాక్సింగ్‌లో కాంస్యం.. ఎల్కతుర్తి బిడ్డ అమ్రీన్‌కు ఘన స్వాగతం

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన యువ బాక్సర్ ఎండీ అమ్రీన్ పంజాబ్‌లో నిర్వహించిన సబ్ జూనియర్ అండర్-15 జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం నుంచి పతకం సాధించిన ఏకైక బాలికగా గుర్తింపు పొందడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఎల్కతుర్తిలోని శ్రీ చైతన్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అమ్రీన్, ప్రముఖ బాక్సింగ్ కోచ్ దేవరకొండ ప్రభుదాస్ శిక్షణలో ఈ ఘన విజయాన్ని అందుకుంది. 58–61 కిలోల విభాగంలో కాంస్య పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకుంది.

అమ్రీన్ విజయాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఎల్కతుర్తి బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ అభినందన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దలు, యువకులు, సహ విద్యార్థులు కలిసి అమ్రీన్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య శేషు, ఉపసర్పంచ్ గొడిశాల రాజు మాట్లాడుతూ, “ఆడపిల్లలు కూడా క్రీడల్లో అత్యున్నత విజయాలు సాధించగలరని అమ్రీన్ నిరూపించింది. ఆమె విజయం ఎల్కతుర్తి యువతకు స్ఫూర్తిదాయకం. కష్టపడి శ్రమిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా జాతీయ స్థాయిలో రాణించవచ్చని అమ్రీన్ చాటిచెప్పింది” అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్రీన్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు హుస్సేన్, యాకూబీలను అభినందించారు.