పెట్రోల్, డీజిల్ ధరలు పెంచొద్దు
రవాణా రంగంపై తీవ్ర ప్రభావం : వైవీ.ఈశ్వరరావు
(విజయవాడ, ఆంధ్రప్రభ) : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే యోచనలను వెంటనే విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ దక్షిణ మండల ఉపాధ్యక్షుడు వై.వి. ఈశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గత రెండు నుండి మూడు సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, ఆ లాభం దేశంలోని వినియోగదారులకు అందలేదని ఇప్పటికే పెరిగిన ఇంధన ధరల కారణంగా రవాణా రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో మరలా ధరలను పెంచడం వలన లారీ యజమానులు, డ్రైవర్లు,సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, ముడి చమురు ధరల్లో పెద్ద ఎత్తున పెరుగుదల అవకాశాలు కనిపించడం లేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంధన ధరల పెంపు నిర్ణయాన్ని పునరాలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుందని,ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి ప్రజల జీవన వ్యయాన్ని పెంచే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని రవాణా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే సరైన నిర్ణయం తీసుకుని, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచకూడదని వై.వి. ఈశ్వరరావు కోరారు.
