యూరియా కోసం రైతుల పోరాటం.. వ్యవస్థలో లోపాలే కారణమా?

వాంకిడి, ఆంధ్రప్రభ: వానాకాలం సాగు ప్రారంభమైన ప్రతిసారీ రైతులను వెంటాడుతున్న యూరియా సమస్య ఈ ఏడాది కూడా తీవ్రంగా కనిపిస్తోందని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రైతు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బోట్పెళ్లి జైరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. సమయానికి యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ.. రైతు వేదికల వద్ద గంటల తరబడి వేచి చూసినా యూరియా దొరకడం లేదని, స్టాక్ వస్తుందనే సమాచారంతో వెళ్లిన రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారని తెలిపారు. పొలాల పనులు వదిలేసి యూరియా కోసం తిరగాల్సిన పరిస్థితి నెలకొనడంతో రైతులకు సమయం, కూలి, ప్రయాణ ఖర్చు రూపంలో అదనపు భారం పడుతోందన్నారు.

ఎకరానికి నాలుగు బస్తాల చొప్పున మాత్రమే యూరియా ఇవ్వడం అన్ని పంటలకు సరిపోదని పేర్కొన్నారు. పంట రకం, నేల స్వభావం, అవసరాన్ని బట్టి కేటాయింపులు ఉండాలని సూచించారు.

ఆన్‌లైన్ బుకింగ్ విధానంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ వివరాలు ముందుగా తెలియకపోవడం, సర్వర్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం, సాంకేతిక అవగాహన లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేని రైతులు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.

కొన్ని ఎరువుల దుకాణాల్లో స్టాక్ వివరాలపై స్పష్టత లేకపోవడం, పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని, వీటిపై సంబంధిత అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని కోరారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం స్టాక్ వివరాలను ప్రతిరోజూ బహిరంగంగా ప్రకటించడం, బుకింగ్ సమయాన్ని ముందుగానే తెలియజేయడం, గ్రామస్థాయిలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయడం, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవడం, అవసరమైతే అదనపు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జైరామ్ సూచించారు.

యూరియా సమస్య కేవలం ఎరువుల కొరత మాత్రమే కాదని, రైతుల పంటలు, కుటుంబాల ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న కీలక అంశమని పేర్కొన్నారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, సరఫరా సంస్థలు సమన్వయంతో పనిచేసి పారదర్శక పంపిణీ వ్యవస్థను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.