పాక్ జైళ్లలో ఉన్న భారతీయులపై కేంద్రం కీలక డిమాండ్…
- పాక్ జైళ్లలో 188 మంది భారతీయులు !
ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లో శిక్షలు పూర్తిచేసుకున్న 188 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలను వెంటనే విడుదల చేసి స్వదేశానికి పంపించాలని భారత్ కోరింది. భారత్–పాకిస్థాన్ మధ్య 2008లో కుదిరిన ద్వైపాక్షిక కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు బుధవారం పరస్పరం తమ తమ ఖైదీల జాబితాలను మార్పిడి చేసుకున్నాయి. ఖైదీల జాబితాల మార్పిడి ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీల్లో నిర్వహించడం ఆనవాయితీ.
ఈసారి భారత్ తన అదుపులో ఉన్న 386 మంది పాకిస్థాన్ పౌర ఖైదీలు, 53 మంది పాకిస్థాన్ మత్స్యకారుల వివరాలను ఇస్లామాబాద్‌కు అందించింది. మరోవైపు పాకిస్థాన్ తన అదుపులో ఉన్న 52 మంది భారతీయ పౌర ఖైదీలు, 198 మంది భారతీయులు లేదా భారతీయులుగా భావిస్తున్న మత్స్యకారుల జాబితాను న్యూఢిల్లీకి అందించింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) విడుదల చేసిన ప్రకటనలో, భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలు, వారి పడవలు, అలాగే అదృశ్యమైన భారత రక్షణ సిబ్బందిని వీలైనంత త్వరగా స్వదేశానికి పంపించాలని పాకిస్థాన్‌ను కోరుతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా విడుదలయ్యే వరకు పాకిస్థాన్ జైళ్లలో ఉన్న భారతీయులు, భారతీయులుగా భావిస్తున్న ఖైదీల భద్రత, రక్షణ, సంక్షేమం పట్ల పూర్తి బాధ్యత వహించాలని కూడా భారత్ విజ్ఞప్తి చేసింది.
పాకిస్థాన్‌లో శిక్షలు పూర్తిచేసుకున్న భారతీయులను మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పునరుద్ఘాటించింది. ఈ సందర్భగా భారతీయులుగా భావిస్తున్న మరో 13 మంది పౌర ఖైదీలకు తక్షణమే కాన్సులర్ యాక్సెస్ (రాయబార కార్యాలయ ప్రతినిధులను కలిసే అవకాశం) కల్పించాలని డిమాండ్ చేసింది.
2014 నుంచి 2,739 మంది..
భారత్ ప్రభుత్వం చేపట్టిన నిరంతర దౌత్య ప్రయత్నాల ఫలితంగా 2014 నుంచి ఇప్పటివరకు 2,661 మంది భారతీయ మత్స్యకారులు, 78 మంది పౌర ఖైదీలు పాకిస్థాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు ఎంఈఏ వెల్లడించింది. వీరిలో 2023 నుంచి ఇప్పటివరకు 500 మంది మత్స్యకారులు, 20 మంది పౌర ఖైదీలు విడుదలైనట్లు తెలిపింది.
ఖైదీల జాబితా మార్పిడి
2008 కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఖైదీల జాబితాలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత హైకమిషన్‌కు 250 మంది భారతీయ ఖైదీల జాబితా అందించింది. ఇందులో 52 మంది పౌర ఖైదీలు, 198 మంది మత్స్యకారులు ఉన్నారు. మరోవైపు, శిక్ష పూర్తిచేసుకుని జాతీయత ధ్రువీకరించబడిన 97 మంది పాకిస్థాన్ ఖైదీలను విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్‌ను కోరినట్లు పాకిస్థాన్ తెలిపింది. వీరిలో 64 మంది పౌర ఖైదీలు, 33 మంది మత్స్యకారులు ఉన్నట్లు పేర్కొంది.
