యూజర్‌నేమ్ ఫీచర్‌పై కొత్త భ‌యం…

  • వాట్సాప్ కు కేంద్ర షాక్
  • మెటాకు నోటీసులు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీసుకొస్తున్న యూజర్‌నేమ్ (WhatsApp Username) ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్ ఆధారంగా చాటింగ్ చేసే ఈ కొత్త ఫీచర్ వినియోగదారుల గోప్యతను పెంచుతుందని వాట్సాప్ చెబుతున్నప్పటికీ, ఇది సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారే ప్రమాదం ఉందని కేంద్రం భావిస్తోంది.

ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులకు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ముందుగానే రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించి యాప్‌లో నోటిఫికేషన్లు కూడా పంపుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకుంటున్నారు.

అయితే ఈ వ్యవస్థ అమలైతే సైబ‌ర్ మోసగాళ్లు ఫోన్ నంబర్ దాచిపెట్టి నకిలీ గుర్తింపులతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉందా అనే కోణంలో కేంద్రం పరిశీలన ప్రారంభించింది. ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

సమీక్షలో ఏవైనా భద్రతాపరమైన లోపాలు గుర్తిస్తే వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. యూజర్‌నేమ్ ఆధారిత వ్యవస్థ వినియోగదారుల గోప్యతను బలోపేతం చేస్తుందా? లేక సైబర్ నేరాలను మరింత క్లిష్టతరం చేస్తుందా? అనే అంశాలపై కేంద్రం దృష్టి సారించింది.