అమరావతిపై కుట్రలను కాంగ్రెస్ సహించదు
- రాజధాని అభివృద్ధికి పూర్తి మద్దతు..
- ప్రత్యేక హోదా సాధన వరకు పోరాటం కొనసాగిస్తాం..
- వైసీపీలో తీవ్ర అంతర్గత సంక్షోభం..
- కాంగ్రెస్ వైపు చూస్తున్న పలువురు వైసీపీ నేతలు..
- రాహుల్ గాంధీ నాయకత్వంలోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు..
- కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇంచార్జి వల్లూరు భార్గవ్
విజయవాడ, ఆంధ్రప్రభ: అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని, రాజధానిపై ఎలాంటి కుట్రలను సహించబోమని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జ్ భార్గవ్ వల్లూరు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.
బుధవారం ఆయన విలేకరులతో భార్గవ్ వల్లూరు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి రాజీకి వెళ్లదన్నారు. అమరావతి అభివృద్ధి వేగవంతం కావాలని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం కొనసాగాలని కోరారు. అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నిరంతరం ప్రస్తావిస్తూ రాష్ట్ర హక్కుల సాధన కోసం కృషి చేస్తోందని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని భార్గవ్ వల్లూరు విమర్శించారు. ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని, డబ్బు కోసం విలువలు, నైతికతలను పక్కన పెట్టిన రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు దేశ భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వం వైపు ఆశగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన అభివృద్ధి, ప్రత్యేక హోదా వంటి హక్కులు సాధ్యమవుతాయనే అభిప్రాయం వారిలో బలపడుతోందన్నారు. ఈ పరిణామాలను దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న పలువురు నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో సంప్రదింపులు జరుపుతున్నారని భార్గవ్ వల్లూరు తెలిపారు.
