రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ నియంత్రణకు సమన్వయ చర్యలు..
రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ నియంత్రణకు సమన్వయ చర్యలు..
బ్లాక్ స్పాట్ల వద్ద భద్రత పెంపు: కలెక్టర్ ఆదేశాలు
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు మాదక ద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తో కలిసి మంగళవారం జూమ్ ద్వారా నిర్వహించిన ఎన్సీఓఆర్డీ, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నేషనల్ హైవే, రవాణా శాఖ, పోలీస్ శాఖ, డ్రగ్స్ నియంత్రణ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఇటీవల నిర్వహించిన బస్సు యాత్రలో గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్లు, రిఫ్లెక్టర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్పీడ్ నియంత్రణ చర్యలు చేపట్టి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో 60 రోజుల్లోగా భద్రతా పనులు పూర్తి చేయాలని సూచించారు.
రోడ్లపై చెడిపోయిన లేదా నిబంధనలకు విరుద్ధంగా నిలిపిన వాహనాలను వెంటనే తొలగించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. డ్రైవర్లు, వాహన యజమానులకు రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
మాదక ద్రవ్యాల నియంత్రణపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మాట్లాడుతూ డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై పోలీస్ శాఖ కట్టుదిట్టంగా నిఘా కొనసాగిస్తోందని తెలిపారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ నియంత్రణలో మరింత మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు.
సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమతమ శాఖల పరిధిలో చేపట్టిన చర్యలను వివరించారు.
