ప్రభుత్వం ఆక్వారంగ అభివృద్ధికి కట్టుబడి ఉంది..

ప్రభుత్వం ఆక్వారంగ అభివృద్ధికి కట్టుబడి ఉంది..

రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఆక్వారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. నాణ్యమైన ఉత్పత్తులు, నూతన పద్ధతుల అమలు, పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆక్వా సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.

మంగళవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆక్వారంగ రైతులు, ప్రతినిధులు, ఎగుమతిదారులతో ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏపీ ఆక్వా స్టేక్ హోల్డర్స్ భాగస్వాములుగా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

ఎగుమతిదారులు ధరలు పెంచే ముందు రైతులతో చర్చించాలని, పెంచిన ధరలు కనీసం 15 రోజుల పాటు స్థిరంగా ఉండేలా చూడాలని సూచించారు. ఏ సీజన్‌లో సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయనే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆక్వాకల్చర్ రంగం జిల్లాలో ఆర్థికాభివృద్ధికి ప్రధాన పాత్ర పోషిస్తోందని, పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యుత్ సరఫరా, నీటి నాణ్యత, వ్యాధి నియంత్రణ, మార్కెట్ ధరలు, ఎగుమతుల పరిస్థితి వంటి అంశాలపై సమీక్షించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్ల పెట్టుబడి వ్యయం పెరగడం, రొయ్యలు, చేపల ధరలు తగ్గడం, మేత, విద్యుత్, లార్వా ఖర్చులు పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

హ్యాచరీల్లో నాణ్యతలేని విత్తనాల విక్రయంపై పర్యవేక్షణ పెంచాలని, నకిలీ మేత, మందులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళారీ వ్యవస్థను అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆక్వా రైతులకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.

ఆక్వా రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా అభివర్ణించిన కలెక్టర్, రైతులు నష్టపోకుండా సరసమైన ధరలకు ఇన్పుట్స్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో అప్సడా డైరెక్టర్ వి. సత్యనారాయణరాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి డి. శ్రీనివాస్, సహాయ సంచాలకులు ఎల్. ఎల్. ఎన్. రాజు, ఎంపెడా డీడీ ఆనంద్, రైతులు, హ్యాచరీ యజమానులు, ఫీడ్ కంపెనీ ప్రతినిధులు, ఎగుమతిదారులు పాల్గొన్నారు.

Leave a Reply