Tirupati Tourism | తిరుమల దర్శన యాత్ర పథకం పునరుద్ధరణకు సిద్ధం

Tirupati Tourism | తిరుమల దర్శన యాత్ర పథకం పునరుద్ధరణకు సిద్ధం

Tirupati Tourism | గత అక్రమాల తర్వాత కొత్త మార్గదర్శకాలపై దృష్టి
పర్యాటక శాఖకు ఆదాయం.. భక్తులకు సులభ దర్శనం

Tirupati Tourism | అమరావతి, ఆంధ్రప్రభ: పర్యాటకులకు తిరుమల వెంకన్న దర్శనం కల్పించేందుకు టూరిజం శాఖ ఏర్పాటు చేసిన పథకాన్ని పునఃప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ స్కీమ్ గత వైసీపీ హయాంలో వివాదాస్పదంగా మారింది. పలు అవకతవకలకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ ఈవో ఈ పథకాన్ని నిలుపుదల చేశారు.

అయితే రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిలిచిపోవడంతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అంతేకాకుండా ఈ పథకం ద్వారా పర్యాటక రంగానికి వచ్చే లక్షలాది రూపాయల ఆదాయం కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది.

ఆధ్యాత్మికం… ఉల్లాసం..

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తిరుమల దర్శన యాత్ర కార్యక్రమం పర్యాటకులకు చక్కటి అనుభూతిని ఇచ్చే విధంగా రూపొందించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు టూరిజం కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఈ పథకం కింద ఆన్‌లైన్ బుక్ చేసుకుంటే, ఆయా తేదీల్లో వారి వారి ప్రాంతాల నుంచే టూరిజం శాఖకు చెందిన బస్సుల్లో తిరుపతికి తీసుకువచ్చేవారు.

అక్కడ సంస్థకు చెందిన రెస్ట్ హౌస్‌ల్లో వారు స్నానాది కార్యక్రమాలు పూర్తిచేసుకున్నాక రూ.300 టికెట్ దర్శనం మార్గంలో అతి తక్కువ సమయంలోనే వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే ఏర్పాట్లను పర్యాటక శాఖ చేపట్టింది. దర్శనానంతరం మళ్లీ టూరిజం బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేసేది.

ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చేది. తక్కువ మొత్తంతో వెంకన్న స్వామిని సులభంగా దర్శించుకునే అవకాశం ఏర్పడేది. రూ.2 వేల నుంచి రూ.3 వేలలోపు ఖర్చుతో తిరుమల యాత్ర పూర్తయ్యేది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా సంస్థకు కూడా భారీగా ఆదాయం సమకూరేది.

అక్రమాలమయం…

ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిన ఈ పథకం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలమయంగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. కేవలం స్వామి వారి దర్శన టికెట్లు విక్రయించుకున్నారన్న విమర్శలు వచ్చాయి. చాలామంది బస్సుల్లో ప్రయాణించకుండానే కేవలం స్వామి వారి టికెట్ల కోసం ఈ పథకం కింద బుక్ చేసుకునేవారని, అయితే బస్సుల్లో ఇతర వ్యక్తులను టూరిజం వారు ఎక్కించుకొని బలవంతంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.

ముఖ్యంగా టికెట్ల విషయంలో అనేక అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కూడా జరిగినట్లు ప్రభుత్వ అంతర్గత విచారణలో తేలింది. రోజుకు ఎన్ని టికెట్లు కేటాయించారు? ఎంత మంది దర్శనం చేసుకున్నారు? తదితర వివరాలన్నింటినీ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి అవకతవకలు నిజమని నిర్ధారించింది.

ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పథకాన్ని రద్దు చేశారు. రెండేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో పర్యాటక శాఖకు ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తోంది.

టూరిజం చైర్మన్ చర్చలు

ఈ పథకం మళ్లీ ప్రారంభించే యోచనలో టూరిజం చైర్మన్ బాలాజీ ఉన్నారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకురాగా, ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు విడతలుగా టూరిజం శాఖాధికారులు, చైర్మన్ టీటీడీ కార్యనిర్వహణాధికారితో భేటీ అయ్యి పథక పునఃప్రవేశపెట్టడంలో ఉన్న లోటుపాట్లు, మార్గదర్శకాలు, నియమ నిబంధనల మార్పు, తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలిసింది.

మరికొద్ది రోజుల్లోనే మళ్లీ ప్రవేశపెట్టే యోచనలో రాష్ట్ర పర్యాటక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే జరిగితే ఆంధ్ర రాష్ట్ర పర్యాటకులకు వేంకటేశ్వరస్వామి దర్శనం మరింత సులభంగా చేసుకునే అవకాశం ఏర్పడుతోంది.

Leave a Reply