దేశ సేవలో ఎన్సీసీ కేడెట్లు కీలకం..
దేశ సేవలో ఎన్సీసీ కేడెట్లు కీలకం..
తిరుపతిలో ఏటీసీ–4 క్యాంప్ ప్రారంభం
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎన్సీసీ విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగి దేశానికి ఉపయోగపడే యువతగా ఎదగాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అన్నారు.
మంగళవారం తిరుపతిలోని ఎన్సీసీ గర్ల్స్ బెటాలియన్లో నిర్వహించిన ఏటీసీ–4 క్యాంప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ క్యాంప్ మే 21 నుంచి 31 వరకు జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్లోని ఐదు జిల్లాల నుంచి సుమారు 600 మంది ఎన్సీసీ విద్యార్థులు పాల్గొంటున్నారని కలెక్టర్ తెలిపారు. ఎన్సీసీ శిక్షణ వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని చెప్పారు.
తాను కూడా విద్యార్థి దశలో ఎన్సీసీలో చేరానని గుర్తు చేసుకున్న కలెక్టర్, ఎన్సీసీ కేవలం సర్టిఫికెట్ల కోసం కాదని, సమాజ సేవ భావనను పెంపొందించేదని అన్నారు. విపత్తులు, వరదలు వంటి పరిస్థితుల్లో ఎన్సీసీ కేడెట్లు ప్రజలకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులు చిన్న వయస్సులోనే లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అనూజ్ వాద్వా మాట్లాడుతూ దేశానికి సేవ చేసే బాధ్యతగల యువతను తీర్చిదిద్దడమే ఎన్సీసీ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
