కాలేశ్వరంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత
కాలేశ్వరంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత
- అంత్య పుష్కరాలకు భారీగా తరలివచ్చిన భక్తులు
- డ్రోన్‌తో పుష్కర ఘాట్‌ను పర్యవేక్షించిన ఎస్పీ సంకీర్త్
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాలేశ్వరానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీసులు విస్తృత భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు అమలు చేశారు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్లను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ స్వయంగా పరిశీలించారు.

పుష్కర ఘాట్, త్రివేణి సంగమం ప్రాంతాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో డ్రోన్ సహాయంతో పరిస్థితిని పర్యవేక్షించి భక్తుల సంఖ్యను అంచనా వేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. భక్తుల సౌకర్యార్థం కీలక ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని మోహరించారు. అలాగే బోటింగ్ నిర్వహిస్తూ భక్తులు నదిలో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. పుష్కర స్నానాలు సురక్షితంగా నిర్వహించుకునేలా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ భక్తులకు అవసరమైన సూచనలు అందించారు.

