స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం

పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట..

ప్రతీ కుటుంబానికి అందుతున్న సంక్షేమ ఫలాలు
శ్రీ బుగులు వెంకట్వశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన
త్వరలోనే మండల కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన
2014కు ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఎన్ని..
తెలంగాణ వనరులు దోచుకొని ఆస్తులు కూడబెట్టుకున్నారు
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం : మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

చిలుపూర్, ఆంధ్ర‌ప్ర‌భ : చిలుపూర్ మండల కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిల్పూర్ మండలానికి సంబందించిన 40మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 40లక్షల 04వేల 640రూపాయల విలువగల చెక్కులను మరియు 41మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 12లక్షల 74వేల రూపాయల విలువగల చెక్కులను పంపిణి చేశారు.

అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.8లక్షల కోట్లకు వాయిదాలు, మిత్తిలు చెల్లిస్తూ కూడా పేద వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2సంవత్సరాల కాలంలో ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా 200యూనిట్ల ఉచిత విద్యుత్, దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణి, నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులతో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు అండగా నిలుస్తూ రైతులకు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం, సన్నాలకు రూ.500బోనస్, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించడం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.

పేద ప్రజల స్వంత ఇంటి కళను సాకారం చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలను చేపట్టి ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లిన పదుల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి 2014కు ముందు ఉన్న ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్నో చెప్పమంటే ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులు దోచుకొని ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు.

ఇవాళ వాళ్లే సుద్దపూసల లెక్క మాట్లాడుతున్నారని ఏద్దేవా చేశారు. ఇక ప్రజల చేత పార్టీల చేత తిరస్కరించబడిన వాళ్ళు కూడా సిగ్గులేకుండా చాలా మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. చిల్పూర్ మండల కేంద్రంలో త్వరలోనే ఎమ్మార్వో, ఎంపీడివో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నట్లు దీనిపై త్వరలోనే దేవాదాయ శాఖ కమిషనర్ తో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1400 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, తహసీల్దార్, ఎంపిడివో, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply