మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక దాడులు

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక దాడులు
25 ప్రాంతాల్లో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
నలుగురికి డ్రగ్స్ పాజిటివ్.. గన్‌పౌడర్ స్వాధీనం
చిత్తూరు, ఆంధ్రప్రభ : జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు నాన్ కేడర్ ఎస్పీ (ఆపరేషన్స్) ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా 25 ప్రాంతాల్లో రౌడీషీటర్లు, గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులు, అనుమానితుల నివాసాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్ల సాయంతో 110 మందికి పరీక్షలు నిర్వహించగా, పూతలపట్టు, గంగవరం, విజయపురం, పాలసముద్రం పోలీస్ స్టేషన్ పరిధులకు చెందిన నలుగురు వ్యక్తులు మాదకద్రవ్యాలు వినియోగించినట్లు పాజిటివ్‌గా గుర్తించారు.

పాజిటివ్‌గా తేలిన వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. మరోవైపు ఐరాల మండలం గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో నిర్వహించిన తనిఖీల్లో గన్‌పౌడర్‌తో పాటు పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఆపరేషన్ అనంతరం “డ్రగ్స్ వద్దు – జీవితం ముద్దు” అనే నినాదంతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది, స్థానికులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ, జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని శాస్త్రీయంగా గుర్తించి, చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైన కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నామని తెలిపారు.
గత వారం రోజుల్లో నగరిలో 12 కిలోలు, గంగవరంలో 2 కిలోలు, చిత్తూరులో 1 కిలో గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ రహిత చిత్తూరు జిల్లా లక్ష్యంగా పోలీస్ శాఖ సంపూర్ణ కట్టుబాటుతో పనిచేస్తోందని పేర్కొన్నారు.
ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగం, నిల్వలు లేదా రవాణా జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.
