40 ఏళ్ల నిరీక్షణకు తెర.. గెరికనెట్టులో సీసీ రోడ్డుకు శ్రీకారం
- గెరికనెట్టులో సీసీ రోడ్డుకు భూమిపూజ
- పాకాల మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పులివర్తి నాని
- ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
చంద్రగిరి, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల పంచాయతీ పరిధిలోని గెరికనెట్టు గ్రామంలో నిర్మించనున్న సీసీ రహదారికి బుధవారం ఆయన భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
గెరికనెట్టు గ్రామంలో దాదాపు 40 సంవత్సరాలుగా నెలకొన్న రహదారి సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తోందని ఆయన అన్నారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామస్తుల రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు లేకుండా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడం కూటమి ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల్లో ఒకటని పేర్కొన్న ఎమ్మెల్యే, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం కాని రహదారి సమస్యను పరిష్కరించి గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
