చిత్తూరులో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

చిత్తూరులో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

రూ.38 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
20 కేసుల్లో ప్రమేయం గుర్తింపు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పట్టణంలోని మిట్టూరు ప్రాంతంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును చిత్తూరు పోలీసులు విజయవంతంగా ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.38 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం గురువారం వివరాలను వెల్లడించింది. చిత్తూరులోని మిట్టూరు ప్రాంతానికి చెందిన ఎన్.పి. గౌతమ్ కిరణ్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై చిత్తూరు మొదటి పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ తుషార్ డూడి పర్యవేక్షణలో చిత్తూరు డీఎస్పీ జె. వెంకటనారాయణ ఆధ్వర్యంలో, చిత్తూరు రెండో పట్టణ సీఐ డి. నెట్టికంటయ్య ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. నేరస్థలంలో లభించిన ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక సమాచారం, ఇతర సాక్ష్యాలను విశ్లేషించి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. దర్యాప్తులో లభించిన సమాచారంతో పోలీసులు జూన్ 4న చిత్తూరు పట్టణంలోని కట్టమంచి ప్రాంతంలో స్వామి వివేకానంద విగ్రహం సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం జరిగిన విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులు పెరుమాళ్లు కృష్ణ అలియాస్ పి. కృష్ణ (54), అతని కుమారుడు కృష్ణ సంతోష్ కుమార్ (26)గా గుర్తించారు. వీరు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాకు చెందినవారని, ప్రస్తుతం తిరుపతి నగరంలోని కొర్లగుంట కొత్తూరు రోడ్డు ప్రాంతంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.28 లక్షల విలువైన 186 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల విలువైన 3.75 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.38 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.

పోలీసుల విచారణలో నిందితులు తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. గృహ యజమానులు ఇంట్లో లేని సమయాలను గమనించి, రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. నిందితుల నేర చరిత్రను పరిశీలించగా కర్ణాటక రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 17 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ప్రాంతంలో 3 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 20 కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాపై మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. అధిక మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను ఇంట్లో నిల్వ ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని సూచించారు. నివాస గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 అత్యవసర సేవల నంబర్ లేదా చిత్తూరు పోలీసుల వాట్సాప్ నంబర్ 9440900005ను సంప్రదించాలని తెలిపారు.

భారీ చోరీ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన చిత్తూరు మొదటి పట్టణ ఎస్‌ఐ కె. శివశంకర్, సహాయ ఉప నిరీక్షకులు, ప్రధాన కానిస్టేబుళ్లు మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, డీఎస్పీ జె. వెంకటనారాయణ అభినందించారు. కేసు ఛేదనలో విశేష కృషి చేసిన సిబ్బందికి నగదు బహుమతులు ప్రకటించినట్లు తెలిపారు..ఈ కేసు ఛేదనతో చిత్తూరు పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ప్రధాన ఆస్తి నేరాల్లో ఒకదానికి పోలీసులు త్వరితగతిన తెరదించడంతో పాటు, విలువైన ఆభరణాలను బాధితులకు తిరిగి అందించే అవకాశం కల్పించారు. పోలీసులు చేపట్టిన సాంకేతిక దర్యాప్తు, సమన్వయ చర్యలు ఫలించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడం గమనార్హమని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply