మైనారిటీల అభ్యున్నతికి ‘జన్ వికాస్’ కీలకం

  • సామాజిక మౌలిక వసతులు, ప్రాథమిక పౌర సౌకర్యాలే పీఎంజేవీకే లక్ష్యం
  • కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
  • లోక్‌సభలో ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నకు కేంద్రం సమాధానం
  • రూ.101.88 కోట్లతో 7 ప్రాజెక్టులు ప్రతిపాదించిన ఏపీ..
  • గత ఐదేళ్లలో కొత్త మంజూర్లు లేవని వెల్లడి

( విజయవాడ, ఆంధ్రప్రభ) : మైనారిటీలు అధికంగా నివసించే ప్రాంతాల్లో సామాజిక మౌలిక వసతులు, ప్రాథమిక పౌర సౌకర్యాల కల్పనే ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పీఎంజేవీకే) ప్రధాన లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

గత ఐదేళ్లలో పీఎంజేవీకే కింద రాష్ట్రాలకు అందిన ప్రతిపాదనలు, నిధుల వివరాలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మంత్రి కిరణ్ రిజిజు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కేంద్ర ప్రాయోజిత పథకంగా దేశవ్యాప్తంగా మైనారిటీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా కేంద్రిత సౌకర్యాలు, తాగునీరు, పారిశుధ్యం, క్రీడలు, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

పీఎంజేవీకే పథకం దేశంలోని అన్ని జిల్లాల్లో అమలులో ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా జిల్లాలను గుర్తించకుండా 15 కిలోమీటర్ల పరిధిలో 25 శాతానికి పైగా మైనారిటీ జనాభా ఉన్న ప్రాంతాలను అర్హత ప్రాతిపదికగా పరిగణిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆయా ప్రాంతాల అవసరాలను పరిశీలించిన అనంతరం, సంబంధిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్న రాష్ట్ర స్థాయి కమిటీ సిఫార్సు చేసిన ప్రాజెక్టులను మాత్రమే కేంద్రం పరిశీలిస్తుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గత ఐదేళ్లలో పీఎంజేవీకే కింద కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త నిధుల మంజూరు జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టుల అమలుకు రూ.8.76 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది.

అలాగే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.101.88 కోట్ల అంచనా వ్యయంతో 26 యూనిట్లు కలిగిన ఏడు ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర పరిశీలనకు పంపినట్లు మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం 2026 మార్చి 31 వరకు అమలుకు ఆమోదం పొందినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన సమాధానంలో పేర్కొన్నారు.