తెలంగాణ నేతల కామెంట్స్ కు మంత్రి నిమ్మల కౌంటర్
వృదా జలాలు సద్వినియోగం కోసమే బనకచర్ల
అనుమతులు వచ్చిన తర్వాతే మూడు దశలలో నిర్మాణం
తెలంగాణ ప్రాజెక్ట్ లకు చంద్రబాబు సహకారం
అమరావతి – బనకచర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాల కోసమేనని, సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలంగాణ నేతలను విమర్శించారు. తెలంగాణలో అంతర్గత రాజకీయలు కోసం బనకచర్లపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. అన్ని నియమ నిబంధనల ప్రకారమే అనుమతి తీసుకుని నిర్మాణం జరుగుతుందన్నారు.
అమరావతిలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 50 ఏళ్లుగా గోదావరి నీరు వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, ఇందులో 200 టీఎంసీల నీరు ఉపయోగించి బనకచర్లకు తరలించాలనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ ఉద్దేశమని అన్నారు.. మూడు సెగ్మెంట్‌లుగా బనకచర్ల నిర్మాణం జరుగుతుందని, పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు.. ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు.. సెగ్మెంట్ 2: బొల్లాపల్లి నుంచి బనకచర్ల వరకు.. సెగ్మెంట్ 3.. ఇలా మూడు సెగ్మెంట్‌లలో నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.
సీడబ్ల్యూసీకి ఇప్పటికే ప్రాధమిక నివేదిక ఇచ్చామని చెప్పారు. ఆమోదం లేకుండా డీపీఆర్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారని, ప్రాధమిక నివేదిక ఆమోదం తెలిపాక డీపీఆర్ ఇస్తామని మంత్రి తెలిపారు. పోలవరం, బనకచర్ల అనుమతులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని మరోసారి స్పష్టం చేశారు.
ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదు..
ఏపీ జలదోపిడీ అని విమర్శలు చేస్తున్నారని, వరద జలాలు ఉపయోగించు కోవడం తమ హక్కు అని, దిగువ రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలు… నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాలు ఉపయోగిస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని, ప్రతి ఏడాది 3వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. ఒక ఏడాది 7 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోయిందన్నారు. ఇంకా వర్షాకాలం పూర్తిగా రాకుండానే సముద్రంలోకి నీరు వృధాగా పోతోందని అన్నారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులకు సరైన అనుమతి తీసుకోలేదని ఆరోపించారు. పూర్తయిన ప్రాజెక్టులకే అనుమతి లేదని, ఇంకా ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టుల అనుమతిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టును ఆపాలన్న దురుద్దేశం తమకు లేదని, సీఎం చంద్రబాబుకు అసలే లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. సీతారాం సాగర్ లిఫ్ట్‌కు కూడా మొన్ననే అనుమతి వచ్చిందని, కానీ 75 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు.
తెలంగాణ ప్రాజెక్ట్ లకు చంద్రబాబు సహకారం..
దేవాదుల ఎత్తి పోతల పథకంతో పాటు చాలా ప్రాజెక్టులకు చంద్రబాబు సహకరించారని, బీమా ఎత్తిపోతల పథకానికి కూడా సహకారం అందించారని మంత్రి నిమ్మల అన్నారు. ఎస్సార్ఎస్పీతో పాటు అనేక ప్రాజెక్టులకు చంద్రబాబు సహకరించారన్నారు. ఈ విషయాన్ని తెలంగాణా ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. దిగువ రాష్ట్రాలకు ఉన్న హక్కుల ప్రకారం చంద్రబాబు కొన్ని ప్రాజెక్టుల విషయంలో అభిప్రాయం చెప్పారు తప్ప అడ్డుకోవాలని కాదని అన్నారు. అపెక్స్‌లో ఇరు రాష్ట్రాల సీఎంల మాటలు మినిట్స్ రూపంలో ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలని చంద్రబాబు చెప్పారని మంత్రి రామానాయుడు వ్యాఖ్యానించారు.