ఆదివాసీ సంప్రదాయాలకు కొత్త గుర్తింపు.. ఉట్నూర్‌లో పీవో ప్రత్యేక కార్యక్రమం
ఆదివాసీ సంప్రదాయాలకు కొత్త గుర్తింపు.. ఉట్నూర్‌లో పీవో ప్రత్యేక కార్యక్రమం
ఉట్నూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో నూతన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నివసించే వివిధ ఆదివాసీ తెగల ఆరాధ్య చెట్ల వివరాలను తెలియజేసే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
ఆదివాసీ సంప్రదాయాల్లో చెట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక్కో తెగ ఒక్కో చెట్టును తమ ఆరాధ్య దైవంగా భావించి పూజిస్తుంది. ఈ నేపథ్యంలో ఏ ఆదివాసీ వర్గం ఏ చెట్టును పూజిస్తుందో స్పష్టంగా తెలియజేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల ఆదివాసీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆవిష్కరించిన ‘సప్తగిరి’ కార్యక్రమంలోని అంశాలను కూడా ఈ సూచిక బోర్డుల్లో పొందుపరిచారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఒకే చోట తెలియజేసేలా ఈ ప్రయత్నం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఆదివాసీ సమాజపు ఆచారాలను గుర్తిస్తూ, వాటిని ప్రజలకు పరిచయం చేసే విధంగా తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికంగా ఆసక్తి వ్యక్తమవుతోంది.
