బహిరంగంగా మద్యం తాగొద్దు
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్లపై కఠిన చర్యలు
కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ చట్టం అమలు
సభలు, ర్యాలీలకు ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి
గోదావరిఖని, ఆంధ్రప్రభ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయని, మద్యం మత్తులో వీధులు, రహదారులపై అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1, 2026 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి గడువును పొడిగించే అవకాశం ఉందన్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 223, హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం-1348 ఫసలీ నిబంధనల ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డీజేలు, డ్రోన్లకూ అనుమతి తప్పనిసరి
అనుమతి లేకుండా డీజే సౌండ్ సిస్టమ్‌లు, డ్రోన్ల వినియోగంపై కూడా నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు సీపీ తెలిపారు. అధిక శబ్దంతో చిన్నారులు, వృద్ధులు, రోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏ కార్యక్రమంలోనైనా మైక్ సెట్ వినియోగించాలంటే సంబంధిత డివిజన్ ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని, ప్రభుత్వం జారీ చేసిన శబ్ద కాలుష్య నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ ఆదేశాలు కూడా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
సభలు, ర్యాలీలపై ఆంక్షలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ చట్టం-2016, హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం-1348 ఫసలీ, పోలీస్ చట్టం-1861 నిబంధనల మేరకు ఆగస్టు 1 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 1 ఉదయం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సీపీ స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
బంద్‌ల పేరుతో వ్యాపార సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించడం, ఇతరులను బెదిరించడం లేదా ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు.
