క్యాన్సర్ చికిత్సలో ‘హైపర్‌సైట్’తో కొత్త అధ్యాయం
అంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక ‘హైపర్‌సైట్’ అడాప్టివ్ రేడియేషన్ థెరపీ విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతోందని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. స్రవంతి తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ సాంకేతికతతో రేడియేషన్ చికిత్సలో కలిగే దుష్ప్రభావాలను 50 నుంచి 60 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని వెల్లడించారు.
మారుతున్న జీవనశైలి కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, పొగాకు వినియోగం, ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల 70 నుంచి 80 శాతం క్యాన్సర్లు వస్తున్నాయని ఆమె వివరించారు. జన్యుపరమైన కారణాలతో వచ్చే క్యాన్సర్లు కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే ఉంటాయని తెలిపారు.
హైపర్‌సైట్ సాంకేతికత ద్వారా చికిత్స సమయంలో కణితి పరిమాణంలో వచ్చే మార్పులు, శరీర అవయవాల కదలికలను నిరంతరం గుర్తించి, ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం కలగకుండా అత్యంత కచ్చితత్వంతో రేడియేషన్ అందించవచ్చని చెప్పారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, ఛాతి భాగంలో కదిలే కణితులకు బ్రీదింగ్ సైకిల్ ట్రాకింగ్ సాయంతో మరింత సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. పాత యంత్రాలతో పోలిస్తే చికిత్స సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.
40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేసే అవకాశాలు అధికంగా ఉంటాయని డా. స్రవంతి సూచించారు. సమావేశంలో యశోద ఆస్పత్రి పీఆర్వో లక్ష్మణరావు పాల్గొన్నారు.
