డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి

  • మంత్రి లోకేష్‌ను బర్తరఫ్‌ చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్‌
  • అనంతపురంలో జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం..
  • డీఎస్సీ అక్రమాలపై ఆధారాలున్న పెన్‌డ్రైవ్‌ అందజేత

అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ: డీఎస్సీ–2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బర్తరఫ్‌ చేయాలని అనంతపురం జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌రెడ్డి, సమన్వయకర్తలు శైలజానాథ్‌, విశ్వేశ్వరరెడ్డి, రంగయ్య, కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నైరుతిరెడ్డి, కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మతో పాటు పలువురు నాయకులు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ తమ వద్ద ఉన్న ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా జాయింట్‌ కలెక్టర్‌కు అందించారు.

ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం నిరుద్యోగ యువత కల అని, మెగా డీఎస్సీ పేరుతో అర్హులకు అన్యాయం చేసి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతో సహా వెల్లడించారని, బాధిత అభ్యర్థులు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టారని అన్నారు.

డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని, మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహింపజేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలలో బేరసారాలు జరిగినట్లు తమ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని, వాటిని పెన్‌డ్రైవ్‌లో జాయింట్‌ కలెక్టర్‌కు సమర్పించినట్లు తెలిపారు.

జోన్‌–1లో ప్రశ్నపత్రాల తయారీలో భాగస్వామిగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి తొలి ర్యాంకు రావడంపై కూడా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశంతో పాటు డీఎస్సీ నియామకాలన్నింటిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు సుమారు రూ.9,500 కోట్ల మేర పేరుకుపోయాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.3 వేల చొప్పున 25 నెలల నిరుద్యోగ భృతిని ప్రతి నిరుద్యోగికి రూ.75 వేలుగా చెల్లించాలని కోరారు.

డీఎస్సీ అక్రమాల అంశంపై వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తోందని, ఆగస్టు 3 నుంచి నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు, రిలే దీక్షలు నిర్వహించనున్నట్లు అనంత వెంకటరామిరెడ్డి వెల్లడించారు.